Site icon NTV Telugu

థియేటర్ల రీఓపెన్ అప్పుడేనా ?

Movie Theatres To Reopen in Telangana From July 1st ?

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై ప్రభావం భారీగానే పడింది. దీని కారణంగానే థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసిందే. ఈ ఏడాది కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో అంటే ఏప్రిల్ రెండవ వారం నుంచి తెలంగాణలో థియేటర్లు మూతబడ్డాయి. థియేటర్లు క్లోజ్ అయ్యి దాదాపు రెండు నెలలు అవుతోంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో థియేటర్లు మళ్ళీ తెరుచుకునే అవకాశం కన్పిస్తోంది. తెలంగాణలో జూన్ 19 వరకు లాక్ డౌన్ నిబంధనలు కొనసాగనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాత్రి కర్ఫ్యూ మాత్రం మరో వారం లేదా నెల వరకు ఉండే అవకాశం ఉంది. అయితే జూలై 1 నుండి థియేటర్లను తిరిగి తెరవడానికి ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. కానీ కేవలం యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతో మాత్రమే థియేటర్లను ఓపెన్ చేయాలని ఆదేశాలను జారీ చేసే అవకాశం ఉంది. మొదటి వేవ్ తరువాత రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లను యాభై శాతం సామర్థ్యంతో రీఓపెన్ చేయడానికి అనుమతించిన విషయం విదితమే. తరువాత దశల వారీగా పూర్తి ఆంక్షలు ఎత్తివేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం సెకండ్ వేవ్ తగ్గినా థర్డ్ వేవ్ భయంతో ముందుగానే థియేటర్లలో యాభై శాతం సీటింగ్ సామర్థ్యాన్ని అనుమతిస్తారు అంటున్నారు. పబ్బులు, జిమ్‌లకు కూడా ప్రభుత్వం అనుమతించవచ్చు.

Exit mobile version