Balakrishna: నందమూరి వారసుడు మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులకు రీసెంట్‌గానే అసలైన గుడ్ న్యూస్ అందింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో దర్శకుడు వశిష్ట కాంబినేషన్లో మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ ఖరారైంది. అయితే ఈ సినిమా అనౌన్స్ అయిన నాటి నుంచి ఒక క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. కొడుకు కోసం నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమాలో తెరపైకి రాబోతున్నారట. కానీ ఆ పాత్రపైనే ఇప్పుడు రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా అనగానే నందమూరి అభిమానుల్లో ఆకాశమంత అంచనాలు ఉండటం సహజం. అయితే అక్కడే దర్శకుడికి పెద్ద చిక్కొచ్చి పడిందట. నటసింహం బాలకృష్ణ ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో ఈలలు, గోలలతో స్క్రీన్లు దద్దరిల్లాల్సిందే. ఆయన పక్కన ఎంత పెద్ద హీరో ఉన్నా డామినేట్ చేసేస్తారు. అలాంటిది డెబ్యూ హీరో అయిన కొడుకు పక్కన బాలయ్య ఎక్కువసేపు కనిపిస్తే.. ప్రేక్షకుల ఫోకస్ మొత్తం తండ్రి పైకే మళ్లి, మోక్షజ్ఞ ఎంట్రీ కాస్త పక్కకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
అందుకే దర్శకుడు వశిష్ట చాలా తెలివిగా ఓ పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. సినిమా మొత్తం బాలయ్యను చూపించకుండా, కేవలం కథ మొదట్లోనే కొద్దిసేపు ఒక పవర్ ఫుల్ గెస్ట్ రోల్లో నందమూరి సింహాన్ని రంగంలోకి దించుతారట. ఆ కాసేపట్లోనే కథకు అదిరిపోయే ఊపునిచ్చి, సినిమా బాధ్యతను కొడుకు చేతిలో పెట్టి సైడ్ అయిపోతారని టాక్. ఆ కొన్ని నిమిషాల ఎంట్రీతోనే థియేటర్లలో రచ్చ లేపి, వచ్చిన ఆ భారీ హైప్‌ను అలాగే మోక్షజ్ఞ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడానికి వాడుకోవాలనేది టీమ్ వ్యూహంగా చెబుతున్నారు. బాలయ్య ఇమేజ్ వారసుడిని తొక్కేయకుండా చూసుకోవాలి, అదే సమయంలో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బజ్ కూడా రావాలి.. అంటే బాలయ్యను ఇలా వాడుకోవడమే కరెక్ట్ రూట్ అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికైతే ఇదంతా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న టాక్ మాత్రమే. అసలు బాలయ్య స్క్రీన్‌పై కనిపిస్తారా లేదా అన్నది తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక క్లారిటీ రావాల్సిందే.

