Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు

Nani

Nani

Nani: ‘ది ప్యారడైజ్’ స్పెషల్ ఇంటర్వ్యూ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పంచుకున్న ముచ్చట్లలో ఒక ఆసక్తికర అంశం సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ తరంలో స్వయంకృషితో ఎదిగిన నాని నటనను, స్క్రీన్ ప్రెజెన్స్‌ను విశ్లేషిస్తూ మోహన్ బాబు చేసిన పోలిక ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. వెండితెరపై యాక్షన్ సన్నివేశాలు, భారీ పోరాటాలు ఎవరైనా చేస్తారని, కానీ కుటుంబ ప్రేక్షకులను, ముఖ్యంగా మహిళా లోకాన్ని థియేటర్లకు రప్పించి వారి హృదయాలను గెలుచుకోవడం ఎంతో కష్టమైన విషయమని అన్నారు. “ప్రతి తరానికి ఒక ప్రత్యేకమైన హీరో ఉంటాడు. మా తరంలో లేడీస్ ఫాలోయింగ్‌తో ఫ్యామిలీ చిత్రాలను శాసించిన ఘనత శోభన్ బాబు గారిది. ఈ తరంలో నానిని తెరపై చూస్తున్నప్పుడు నాకు తరచూ శోభన్ బాబు గారే గుర్తుకొస్తారు. ఆయనలాగే నాని కూడా మహిళల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు” అంటూ మనస్ఫూర్తిగా ప్రశంసించారు.

సాధారణంగా ఒకసారి ఫ్యామిలీ హీరోగా ముద్రపడితే ఆ ఇమేజ్‌ను వదిలించుకోవడం సులభం కాదని, కానీ నాని మాత్రం ఏ ఇమేజ్ చట్రంలోనూ బందీ కాకుండా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నాడని మోహన్ బాబు కొనియాడారు. మాస్ అయినా, క్లాస్ అయినా, కంటెంట్ బేస్డ్ సినిమాలైనా నాని తనదైన శైలిలో ఒదిగిపోవడం వల్లే ఇంతటి క్రేజ్ దక్కిందని విశ్లేషించారు. యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో లెక్కలేనంత మంది స్టార్ హీరోలను దగ్గరుండి చూసిన మోహన్ బాబు లాంటి సీనియర్ లెజెండ్.. నానిని ఏకంగా ‘సోగ్గాడు’ శోభన్ బాబుతో పోల్చడంపై అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఇచ్చిన ఈ ప్రశంస నాని కెరీర్‌కు మరో పెద్ద కాంప్లిమెంట్‌గా నిలిచిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.