మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ తేదీ ఖరారైంది. మలయాళంలో తొలిసారి మోహన్ లాల్ ను డైరెక్ట్ చేస్తూ, పృధ్వీరాజ్ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా ‘లూసిఫర్’ అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడీ సినిమాను చిరంజీవి హీరోగా ప్రముఖ నిర్మాతలు ఆర్. బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. సురేఖ కొణిదెల సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈ యేడాది జనవరి 20న జరిగాయి.
Read Also : షూటింగ్ పూర్తి చేసుకున్న “శ్యామ్ సింగ రాయ్”
ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా తెలుగులో ‘లూసిఫర్’ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఫిబ్రవరి మాసంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావించారు. కానీ ఊహించని విధంగా కరోనా కేసులు తిరిగి పెరగడం, సెట్స్ పై ఉన్న ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా పడటంతో ‘లూసిఫర్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ కూడా తదనుగుణంగా పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా తొలి షెడ్యూల్ జరగాల్సిన సెట్ వర్క్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే… ఆగస్ట్ 12 నుండి ఈ సెట్ లో షూటింగ్ ప్రారంభిస్తారు. మలయాళంలో మంజు వారియర్ పోషించిన కీలకపాత్రను తెలుగులో నయనతార చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎస్. ఎస్. తమన్ స్వరాలు సమకూర్చుతుండగా, లక్ష్మీ భూపాల్ రచన చేస్తున్నారు.