NTV Telugu Site icon

May Day : నేడే… మే డే… ప్రజాపక్షం నిలచిన ఎర్రజెండాలు!

May Day

May Day

కార్మిక, కర్షక, శ్రామికుల దినోత్సవంగా మే 1వ తేదీ నిలచింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో మే డేని నిర్వహిస్తున్నారు. విప్లవ దినోత్సవంగానూ కొందరు మే డేను అభివర్ణిస్తారు. ఏది ఏమైనా ప్రపంచ కార్మిక దినోత్సవంగా మే 1వ తేదీ జేజేలు అందుకుంటోంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పని గంటల తగ్గింపు కోసం 1837లో పోరాటం సాగింది. దాంతో అమెరికా అంతటా రోజుకు పది గంటలు పని గంటలుగా శాసనం చేశారు. ఆ స్ఫూర్తితోనే ఆ తరువాత 1862లో మన దేశంలో కలకత్తా హౌరా రైల్వే స్టేషన్ లో రైల్వే కార్మికులు పనిగంటల తగ్గింపు కోసం పోరాటం చేశారు. ఆ తరువాత అడపా దడపా ఈ చరిత్రను స్మరించుకున్నారే కానీ, మన దేశంలో 1923లో తొలిసారి మే డే ను పాటించారు. అప్పటి నుంచీ కార్మిక పక్షం నిలచి వామపక్షవాదులు మేడేను నిర్వహించడంతో అది కమ్యూనిస్టుల దినోత్సవంగానూ భావించారు. బెంగాల్ లోనే ముందుగా మే డే ఊపందుకుంది. అంతే కాదు, వామపక్షవాదానికి దగ్గరగా పోరాట తత్వం ఉన్న నాయకులు కూడా బెంగాల్ లోనే ఎక్కువగా ఉండడం వల్ల అక్కడి సినిమాల్లోనూ కొన్ని చోట్ల మే డే జరిపినట్టు చూపించారు. ఆ పై దక్షిణాదిన కేరళలో ఆ తరహా చిత్రాలు కొన్ని వెలుగు చూశాయి.

దక్షిణాదిన మే డే అంతగా ఊపందుకుంది 1950ల తరువాత అనే చెప్పాలి. అయితే ద్రవిడ ఉద్యమం నేపథ్యంలో తమిళనాట చిత్రాలు రూపొందసాగాయి. తెలుగువారు మాత్రం కుటుంబకథలతోనే ముందుకు సాగారు. మే 1వ తేదీన చిత్రాలు విడుదల కావడం జరిగింది. కానీ, అవి కూడా కుటుంబ కథాచిత్రాలే కావడం విశేషం. 1969లో యన్టీఆర్ తో బి.విఠలాచార్య తెరకెక్కించిన జానపద చిత్రం ‘గండికోట రహస్యం’ను మే 1న విడుదల చేశారు. అందులో ప్రజల పక్షం నిలచి కథానాయకుడు పోరాటం చేసే నేపథ్యం ఉంది. డి.వి.యస్.రాజు నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత 1974లో మే 1న కృష్ణ తన 100వ చిత్రంగా తెరకెక్కించిన ‘అల్లూరి సీతారామరాజు’ను విడుదల చేశారు.

విప్లవజ్యోతిగా తెలుగువారి మదిలో నిలచిపోయిన అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని విప్లవదినోత్సవం మే 1న విడుదల చేయడం అప్పట్లో విశేషంగా ముచ్చటించుకున్నారు. పైగా తెలుగుచిత్రసీమలో సినిమాస్కోప్-ఈస్ట్ మన్ కలర్ లో రూపొందిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం! తొలి నుంచీ వామపక్ష భావాలకు ఆకర్షితులైన నటుడు, నిర్మాత మాదాల రంగారావు తాను నిర్మించి, నటించిన చిత్రాలలో ఎర్రజెండాలు ఎగరేసి సంబరాలు చేసేవారు. ఆయన నిర్మించి, నటించిన ‘ఎర్రమల్లెలు’ చిత్రాన్ని 1981న మే డేన విడుదల చేయడం విశేషం! పైగా ఇందులో “నేడే మే డే…” అనే పాట కూడా చోటు చేసుకోవడం మరింత విశేషం! ఆ తరువాత కూడా మాదాల రంగారావు తాను నిర్మించిన కొన్ని చిత్రాలను మే డేన విడుదల చేశారు.

ఇక ఆ పై కూడా పలు తెలుగు చిత్రాలలో మే డే నేపథ్యం చూపించారు. కృష్ణ 1982లో నిర్మించి, నటించిన ‘ఈనాడు’ చిత్రంలో “నేడే ఈ నాడే…” పాటలో ప్రజల పక్షం నిలచి పోరాడిన యోధునిలాగే కనిపించారు. అప్పట్లో ఎర్ర కండువాలు కానీ, నల్లని ఉత్తరీయం కానీ ధరించి సినిమాల్లో కనిపిస్తే విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాలూ వినిపించేవి. యన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన ‘చండశాసనుడు’ చిత్రంలో ఎర్ర జెండాలు పట్టుకొని పోరాటం చేసే జనం నేపథ్యంలో “జనం తిరుగబడుతోంది… ధనం ఉలికి పడుతోంది…” అంటూ పాటను రూపొందించారు. బాలకృష్ణ హీరోగా నటించిన ‘నిప్పురవ్వ’లోనూ కార్మికపక్షం నిలచి, “రండి… కదలిరండి…” అంటూ ఉద్యమ గీతం ఆలపించేలా చిత్రీకరణ సాగించారు.

హీరోలు ఇలా సాగితే, తన జీవితమంతా ఎర్రజెండా పట్టుకొని ప్రజల పక్షం నిలచి తన ‘స్నేహచిత్ర’ పతాకంపై చిత్రాలను నిర్మిస్తూనే ఉన్నారు ఆర్.నారాయణ మూర్తి. ఆయన సినిమాల్లో “ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియెల్లో…” వంటి పాటలు అనేకం వెలుగు చూసి జనాన్ని మురిపించాయి. నారాయణ మూర్తి గురువు దాసరి నారాయణరావు సైతం ఎర్ర బావుటా ఎగరేస్తూ “ఒరేయ్ రిక్షా, ఒసేయ్ రాములమ్మ” వంటి చిత్రాలలో ఉద్యమం సాగించేలా ప్రజాకవుల కలాల నుండి జనం భాషలో పాటలు రాయించి అలరించారు. యన్.శంకర్ లాంటి దర్శకులు తమ చిత్రాలలో విప్లవగీతాలను ప్రత్యేకంగా చిత్రీకరిస్తూ సాగారు. వీరి చిత్రాల నేపథ్యంలో నక్సలిజం చోటు చేసుకొనేది. కృష్ణవంశీ నిర్మాతగా మారి తెరకెక్కించిన ‘సిందూరం’లోనూ నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఉండడం, అందులోని కొన్ని పాటల్లో మన దేశంలోని స్వరాజ్యాన్నే ప్రశ్నించడమూ కనిపిస్తుంది. సదరు పాటల్లో తప్పకుండా విప్లవానికి ప్రతీకగా నిలచిన ఎర్రజెండాలు కనిపించేవి. ఇలా సాగిన ఎర్ర పాటల్లో మే డే కూడా కనిపించిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందువల్ల మే డే అనుకోగానే తెలుగు చిత్రసీమలో సదరు ‘ఎర్ర’ పాటలను గుర్తు చేసుకోవడం సంప్రదాయంగా మారింది. ఈ సారి మే డేన తెలుగు చలన చిత్ర కార్మిక సమాఖ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ‘ఆచార్య’లో నక్సలైట్ పాత్రలో కనిపించిన మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం!