Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!

Mani Ratnam Movie (2)

Mani Ratnam Movie (2)

Mani Ratnam Movie: మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా తెరకెక్కనున్న కొత్త మూవీ వరుస అప్‌డేట్‌లతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. టైటిల్ ఇంకా ప్రకటించకపోయినా, ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్, డిజిటల్ హక్కులు వంటి వివరాలు బయటకు రావడంతో ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా మణిరత్నం, ఏఆర్ రెహమాన్, విజయ్ సేతుపతి, సాయి పల్లవి వంటి క్రేజీ కాంబినేషన్ ఒకే ప్రాజెక్ట్‌లో కలిసి రావడం అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ షూటింగ్ (జూలై 23) ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌ను కోల్‌కతాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపు పది రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. అనంతరం చిత్రబృందం పుదుచ్చేరికి వెళ్లి రెండో షెడ్యూల్‌ను పూర్తి చేయనుంది. మొత్తం షూటింగ్‌ను సుమారు 40 రోజుల్లో పూర్తి చేయాలనే ప్రణాళికతో మణిరత్నం ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందే ఈ సినిమాను ‘మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ నెం.23’ పేరుతో ప్రకటించారు. మణిరత్నం సినిమాలకు ప్రాణం పోసే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరోసారి ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరాలు ఈ ప్రేమకథను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా, సినిమా డిజిటల్ హక్కులు సుమారు రూ.20 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. విదేశీ పంపిణీ హక్కులు, ఆడియో హక్కులు కూడా భారీ మొత్తానికే అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది సినిమా రిలీజ్ కు ముందే మార్కెట్‌లో ఈ మూవీకి ఎంతటి క్రేజ్ ఏర్పడిందో ఇట్టే తెలుస్తోంది. మరోవైపు విజయ్ సేతుపతి వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీలో సంయుక్త, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ‘పాకెట్ నవల’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, ‘సూపర్ డీలక్స్’ తర్వాత వీరిద్దరి కలయికలో సెకండ్ మూవీగా నిలుస్తోంది. ఇందులో మాలవిక మోహనన్, రాజ్ బి. శెట్టి కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

అంతేకాకుండా వెట్రిమారన్ రూపొందిస్తున్న ‘అరసన్’ చిత్రంలో కూడా విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ధనుష్ నటించిన ‘వడ చెన్నై’ సినీ విశ్వానికి స్పిన్ ఆఫ్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. సాయి పల్లవి విషయానికి వస్తే, ఆమె కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘రామాయణం’. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనున్నారు. యష్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌ల మధ్య మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతితో ఆమె నటించనున్న ఈ రొమాంటిక్ డ్రామా కూడా ప్రేక్షకుల్లో భారీ హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు టైటిల్, ఫస్ట్ లుక్, షూటింగ్ అప్‌డేట్‌ల కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.