Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు

Malayalam Director Balraj K

Malayalam Director Balraj K

Malayalam Director Balraj Kalarickal: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. యువ దర్శకుడు బాలరాజ్ కలరికల్ (Balraj Kalarickal) 28 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన దర్శకత్వం వహించిన కప్పి స్క్వాడ్ (Kappi Squad) వెబ్ సిరీస్ ఇటీవలే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇంతలోనే ఆయన మరణవార్త వెలువడటంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన మణిమాల ఆయన స్వస్థలం. దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలో బాలరాజ్ మరణించడం మలయాళ సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

అందిన సమాచారం ప్రకారం, బాలరాజ్ ఎర్నాకుళంలోని ఓ హోటల్ గదిలో మృతిచెందినట్లు గుర్తించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు ప్రాథమిక సమాచారంలో వెల్లడైంది. హోటల్ గది తలుపు తట్టినా బాలరాజ్ స్పందించకపోవడంతో సిబ్బంది అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డోర్ ఓపెన్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం పరీక్షలు పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బాలరాజ్ కలరికల్ స్వతంత్ర దర్శకుడిగా కప్పి స్క్వాడ్ వెబ్ సిరీస్‌తో పరిచయమయ్యారు. ఈ సిరీస్ అక్టోబర్ 15 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇప్పటివరకు నాలుగు ఎపిసోడ్‌లు విడుదలయ్యాయి. మొత్తం 36 ఎపిసోడ్‌ల సిరీస్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. తన తొలి దర్శకత్వ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొద్దికాలానికే బాలరాజ్ మృతిచెందడంతో అభిమానులను, సినీ పరిశ్రమకు చెందిన వారిని కలచివేసింది.

దర్శకుడిగా మారకముందు బాలరాజ్ మలయాళ చిత్ర పరిశ్రమలో అసోసియేట్ డైరెక్టర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. నిళల్ (Nizhal), మధురం (Madhuram), డాగిని (Dagini) వంటి చిత్రాలకు ఆయన పనిచేసినట్లు సమాచారం. సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న బాలరాజ్.. తొలి వెబ్ సిరీస్‌తోనే దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆయన అకాల మరణం మలయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా నిలిచింది.