సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, బంధాలపై మీడియా అడిగే కొన్ని ప్రశ్నలు ఒక్కోసారి శృతి మించుతుంటాయి. తాజాగా అందాల భామ మాళవిక మోహనన్‌కు సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు, తమిళనాడు మీడియాకు చెందిన కొందరు ప్రతినిధులు కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్‌ను ఉద్దేశించి కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు వేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మాళవిక, సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ మీడియా రంగం మరియు అక్కడి జర్నలిస్టుల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని చెబుతూనే, నిన్నటి ఈవెంట్‌లో కొందరు ప్రవర్తించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. “నిన్న నేను హాజరైన ఈవెంట్‌లో తమిళనాడు మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులు ప్రవర్తించిన తీరు అస్సలు బాలేదు. కేవలం రేటింగులు, సెన్సేషన్ కోసమే అన్నట్టుగా వారు అడిగిన కొన్ని ప్రశ్నలు చాలా అసభ్యకరంగా, అసందర్భంగా ఉన్నాయి. అలాంటి ప్రశ్నల అవసరం అక్కడ ఎంతమాత్రం లేదు.” అని మాళవిక ఆవేదన వ్యక్తం చేశారు.
దళపతి విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్‌తో ‘మాస్టర్’ సినిమాలో కలిసి నటించిన మాళవిక, గత ఏడేళ్లుగా ఆయన తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. విజయ్ సార్ నాకు గత ఏడు సంవత్సరాలుగా బాగా తెలుసు. ఒక వ్యక్తిగా, నటుడిగా ఆయనపై నాకు ఎనలేని గౌరవం ఉంది. ఒక సామాన్యుడి స్థాయి నుంచి ఆయన ఈరోజు రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ సాధించిన ఎదుగుదల, ఆయన సాగించిన ప్రయాణం నిజంగా అద్భుతం, స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తిని నా స్నేహితుడిగా పిలుచుకోవడానికి నేనెప్పుడూ గర్వపడతాను. భవిష్యత్తులో జరిగే ప్రెస్ మీట్‌లు లేదా ఇంటర్వ్యూలలో మీడియా ప్రతినిధులు కాస్త హుందాగా, గౌరవప్రదంగా నడుచుకోవాలని మాళవిక కోరారు. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని లేదా స్నేహాన్ని సెన్సేషనలైజ్ చేయడం మానుకోవాలని, అందరి శ్రేయస్సు దృష్ట్యా ఇరుపక్షాల మధ్య పరస్పర గౌరవం ఉండాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు.
