Varanasi Update: : ‘వారణాసి’లో 25 నిమిషాల రామాయణ ఘట్టం.. ఆధునిక టైమ్ ట్రావెల్ కథతో లింక్?

Ramayana Episode In Varanasi

Ramayana Episode In Varanasi

25-Minute Lord Rama Episode in Varanasi Movie: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తోంది. ఇప్పటికే గ్లోబ్‌ ట్రోటింగ్‌ అడ్వెంచర్‌, టైమ్‌ ట్రావెల్‌ అంశాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన బజ్ నెట్టింట వినిపిస్తోంది. ఇందులో మహేశ్ బాబు పోషిస్తున్న రుద్రుడి పాత్రకు, రామాయణంలోని శ్రీరాముడి ఘట్టానికి కీలకమైన సంబంధం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

వారణాసిలో సుమారు 25 నిమిషాల పాటు సాగే శ్రీరాముడి ఎపిసోడ్ ఉండనుందట. ఈ ఘట్టం కేవలం పౌరాణిక అంశంగా కాకుండా.. ఆధునిక కాలంలో రుద్రుడి టైమ్ ట్రావెల్ కథతో నేరుగా ముడిపడి ఉంటుందని టాక్. రామాయణ యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు కూడా సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివరాలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఇటీవల రణ్‌బీర్ కపూర్ నటించిన ‘రామాయణ’కు బాక్సాఫీస్ వద్ద వచ్చిన విజయంతో ఈ తరహా పౌరాణిక కథాంశాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో వారణాసిలో రామాయణ ఘట్టం ఉంటుందన్న వార్త అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. గ్లోబ్‌ ట్రోటింగ్‌ అడ్వెంచర్‌, టైమ్‌ ట్రావెల్‌, రామాయణ యుద్ధం వంటి విభిన్న అంశాలన్నింటినీ జక్కన్న ఒకే కథలో ఎలా చూపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. వారణాసి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో ఆలస్యం జరుగుతోందని, దాని ప్రభావం 2027 ఏప్రిల్‌లో అనుకున్న విడుదల తేదీపై పడవచ్చని కూడా కొన్ని కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం నుంచి మరోసారి అధికారిక ప్రకటన వస్తే అన్నింటికీ చెక్ పడనుంది. ఇక కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా వారణాసిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాత్రల పరిచయాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. మరో అప్ డేట్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.