Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!

Ss Rajamouli Mahesh Babu

Ss Rajamouli Mahesh Babu

Mahesh Babu on SS Rajamouli Working Style: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ ‘వారణాసి’. ఇందులో ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి టాలెంటెడ్ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా వారణాసిపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా జక్కన్న, మహేష్ కాంబినేషన్ కావడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌ల ద్వారా చిత్ర యూనిట్ వెల్లడిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఓ విదేశీ పాడ్‌కాస్ట్‌లో మహేష్ బాబు మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

పాడ్‌కాస్ట్‌లో యాంకర్ రాజమౌళిని మొదటిసారి ఎప్పుడు మాట్లాడారని అడగ్గా.. మహేష్ బాబు సరదాగా స్పందించారు. ‘నేను ఈ సినిమా కోసం దాదాపు 15 ఏళ్ల క్రితం రాజమౌళి గారిని కలిశాను. మగధీర మూవీ విడుదలైన తర్వాత నేను రాజమౌళి ఇంటికి వెళ్లి సినిమా చేద్దాం అన్నాను. నా చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయని, అవి పూర్తయిన వెంటనే సినిమా చేద్దామని రాజమౌళి చెప్పారు. ఆ రెండు సినిమాలు పూర్తి కావడానికి ఏకంగా 15 ఏళ్ల సమయం పట్టింది. అయితే ఇప్పటికీ ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ద్వారా మా కాంబినేషన్ కుదరడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు.

రాజమౌళితో పనిచేయడంపై కూడా మహేష్ బాబు స్పందించారు. ‘కొందరు నటులు, నా మిత్రులు రాజమౌళితో పనిచేయడం చాలా కష్టమని భయపెట్టారు. పిండేస్తాడు అని కూడా చెప్పారు. కానీ నాకు మాత్రం అలా అనిపించలేదు. ఆయనతో పనిచేయడం చాలా భిన్నంగా ఉంది. రాజమౌళి వద్ద ఉన్న రీహార్సల్స్, పక్కా ప్రణాళిక, ప్లానింగ్ వల్ల షూటింగ్ ప్రాసెస్ చాలా సులభంగా, సరదాగా సాగిపోతోంది. రాజమౌళి వర్కింగ్ స్టైల్‌కు అలవాటు పడిపోయా. ఇకపై వేరే దర్శకులతో పనిచేయడం నాకు కొంత కష్టంగా అనిపిస్తుందేమో’ అని మహేష్ బాబు సరదాగా అన్నారు.