LGBT Legal Battle: పార్ట్-2కు ప్రభుత్వ సహకారం ఉంటుందన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్!

Lgbtq

Lgbtq

సామాజిక అంశాన్ని అత్యంత హృద్యంగా ఆవిష్కరించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్’ చిత్రం విజయవంతంగా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఘనంగా విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా గౌరవప్రదమైన జీవితం ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నామని, అందరితో సమానంగా వారు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా రాబోయే ‘ఎల్‌జీబీటీ పార్ట్-2’ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన ప్రకటించారు. దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించి 50 రోజుల విజయాన్ని అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి మనిషిని గౌరవించే భావన సమాజంలో పెరగాలనే ఈ సినిమాను తీశామని తెలిపారు.