టైటానిక్ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించి ప్రపంచాన్ని ఆకట్టుకున్న లియానార్డో డికాప్రియో తరువాత ఎన్నో అవార్డ్ విన్నింగ్ మూవీస్ చేశాడు. అక్లెయిమ్డ్ పర్ఫామెన్స్ తో సత్తా చాటాడు. ప్రస్తుతం ఆయన హాలీవుడ్ లో బిగ్ ఐకాన్. అందుకే, తన క్రేజ్ అండ్ కరెన్సీతో ఓ ఆదర్శవంతమైన పని చేయటానికి పూనుకున్నాడు!
లియనార్డో ‘రీవైల్డ్’ అనే సంస్థతో కలసి వన్య ప్రాణుల రక్షణకి నడుం బిగించాడు. ఊరికే మాటలు చెప్పి, నినాదాలు ఇవ్వటం కాకుండా తన జేబులోంచి 43 మిలియన్ డాలర్లు విరాళంగా అందించాడు! అడవి జంతువులు అంతరించిపోకుండా కృషి చేస్తోన్న అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థతో ఆయన చేతులు కలిపాడు. ‘రీవైల్డ్’తో ముందు ముందు కలసి పని చేయనున్న డికాప్రియో మొదట లాటిన్ అమెరికాలోని దీవులు, అడవుల్లో వన్య ప్రాణుల సంరక్షణపై దృష్టి పెట్టనున్నాడు. మెక్సికో నుంచీ చిలీ దాకా విస్తరించిన అడవుల్లో ఎన్నో అరుదైన అడవి జంతువులు ఉంటాయి. అవి ప్రస్తుతం మానవ తప్పిదాలు, స్వార్థం వల్ల అంతరించిపోయే దశలో ఉన్నాయి. వాట్ని సంఖ్యాపరంగా పెంచే ప్రయత్నాల్లో వన్య ప్రాణి సంరక్షకులు ఉన్నారు. లియానార్డో డికాప్రియో వారికి తన వంతు సాయం అందించనున్నాడు.