Site icon NTV Telugu

దిగ్గజ నటుడు దిలీప్‌ మృతిపట్ల పలువురు సంతాపం

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 1944 నుంచి 1998 వరకు దిలీప్‌ కుమార్‌ చిత్రపరిశ్రమలో రాణించగా.. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 1993లో ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కించుకున్నాడు. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2015లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో ఆయనను సన్మానించింది.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రధాని మోడీతోపాటు పలువురు సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేశారు. ‘ఆయన మరణం సినీ లోకానికి, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు అంటూ ప్రధాని ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కొన్నేళ్లపాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న లెజెండ్‌ మృతి బాధకరం.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి సంతాపం ప్రకటించారు.

దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఎన్టీఆర్‌ ట్వీట్ చేశారు.

Exit mobile version