Kriti Sanon: బాలీవుడ్ స్టార్ బ్యూటీ, నేషనల్ అవార్డ్ విన్నర్ కృతి సనన్ (Kriti Sanon) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఆమె ‘ఎగ్ ఫ్రీజింగ్’ (Egg Freezing ) చేయించుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుత ట్రెండ్‌లో కెరీర్, వ్యక్తిగత జీవితం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకునే ఆధునిక మహిళలకు ఇదొక గొప్ప ఆప్షన్ అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘మిమీ’ (Mimi) సినిమా షూటింగ్ సమయంలోనే తాను ఈ ‘ఎగ్ ఫ్రీజింగ్’ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు వివరించారు. ఆ సినిమాలో గర్భిణీగా కనిపించడం కోసం ఆమె దాదాపు 15 కిలోల బరువు పెరిగారు. “ఆ సమయంలో నా హార్మోన్లలో చాలా మార్పులు వచ్చాయి. భవిష్యత్తులో అమ్మతనం (తల్లి కావడం) విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ముందుచూపుతో, వైద్యుల సలహా మేరకు బరువు పెరుగుతున్న ఆ ఫేజ్‌లోనే నా అండాలను భద్రపరుచుకున్నాను” అని కృతి వెల్లడించారు.
“మనం కెరీర్‌పై ఫోకస్ పెట్టినప్పుడు, మన బాడీకి సంబంధించిన ఇలాంటి కీలక నిర్ణయాలను ముందే ప్లాన్ చేసుకోవడం తప్పు కాదు” అని కృతి సనన్ చెప్పుకొచ్చారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి, పిల్లల గురించి ఆలోచించడం కొంచెం ఆలస్యమవుతుంటుంది. వయసు పెరిగేకొద్దీ మహిళల్లో అండాల నాణ్యత తగ్గే అవకాశం ఉన్నందున, ముందే వాటిని ఫ్రీజ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఎప్పుడైనా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వచ్చని అన్నారు. గతంలో ప్రియాంకా చోప్రా, ఏక్తా కపూర్ వంటి తారలు కూడా ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఓపెన్‌గా మాట్లాడగా.. ఇప్పుడు కృతి సనన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె తీసుకున్న బోల్డ్ అండ్ మెచ్యూర్డ్ డెసిషన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

