ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు, నిర్మాత, స్టిల్ ఫోటోగ్రాఫర్ శివన్ (89) కన్నుమూశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఆయన కుమారుడే! అరవై సంవత్సరాల క్రితం ఆయన కేరళ రాజధాని తిరువనంతపురంలో శివన్ స్టూడియో పేరుతో ఫోటో స్టూడియోను పెట్టారు. స్టిల్ ఫోటోగ్రాఫర్ గా శివన్ విశేష ఖ్యాతి గడించారు. పలు సాంస్కృతిక సంస్థలకు ఆయన ఫోటో స్టూడియోనే కేంద్రంగా ఉండేది. ఆయన తీసిన ఛాయాచిత్రాలు నేషనల్ జియోగ్రాఫిక్, న్యూస్ వీక్, స్పాన్ వంటి పలు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అనంతరం శివన్ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. నిర్మాతగా, దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. శివన్ రూపొందించిన ‘అభయమ్’ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును గెలుచుకుంది. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. తండ్రి శివన్ అడుగు జాడల్లోనే నడిచిన రెండో కుమారుడు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా ఖ్యాతి గడించారు. శివన్ పెద్ద కుమారుడు సంగీత్, చిన్నకుమారుడు సంజీవ్ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. మూడు జాతీయ అవార్డులను అందుకున్న శివన్ తిరువనంతపురంలోని ఇంటిలో ఈ రోజు ఉదయం పడిపోయారు. హాస్పిటల్ కు తరలించగా, గుండెపోటుతో అప్పటికే మరణించినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. శివన్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ అరిఫ్ అహ్మద్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు.