Karthi and Suriya Waiting for Lokesh Kanagaraj: ‘కూలీ’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో లోకేశ్ కనగరాజ్‌కు రజనీకాంత్ మరో అవకాశం ఇవ్వలేదేమో తెలియదు కానీ.. హీరో కార్తీ మాత్రం లోకి పనితనంపై భారీ నమ్మకంతో ఉన్నారు. ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్స్ కోసం కార్తీతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లోకేశ్ మాత్రం ప్రస్తుతం హీరోగా, ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సీక్వెల్స్ ఎప్పుడు మొదలవుతాయనే దానిపై స్పష్టత రావడం లేదు.
ఖైదీ 2 ఎప్పుడు ప్రారంభమవుతుందని కార్తీని అడిగిన ప్రతిసారీ.. లోకేశ్ కనగరాజ్‌నే అడగాలని సమాధానమిచ్చారు. ఇటీవల ‘సర్దార్ 2’ ఈవెంట్‌లోనూ ఇదే ప్రశ్న ఎదురుకాగా.. త్వరలోనే సినిమా మొదలవుతుందని చెప్పారు. ఇలా రెండేళ్లుగా సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని చెబుతున్నప్పటికీ.. ఇప్పటివరకు ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో ఖైదీ 2 కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో నిరీక్షణ కొనసాగుతోంది. కార్తీ మాత్రమే కాదు.. ఆయన అన్నయ్య సూర్య కూడా లోకి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సూర్యతో పూర్తిస్థాయి సినిమా చేస్తానని లోకేశ్ గతంలో ప్రకటించాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చిందనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.
తాజాగా సూర్యకు ఈ సినిమా గురించి ప్రశ్న ఎదురుకాగా.. చర్చలు జరుగుతున్నాయని, ఇంకా చాలా ప్రక్రియ ఉందని చెప్పారు. అదే సమయంలో లోకేశ్‌కు తనకు ఫోన్ చేయమని, తనను కలవమని సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో రోలెక్స్ సినిమా కోసం సూర్య కూడా ఎదురుచూస్తున్నాడనే చర్చ మొదలైంది. మరోవైపు ‘డీసీ’ సినిమాతో హీరోగా తనను తాను నిరూపించుకున్న లోకేశ్.. తదుపరి అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. బన్నీతో భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ కోసం లోకేశ్ ఒకటి నుంచి రెండేళ్ల వరకు సమయం కేటాయించాల్సి రావచ్చు. ఈ లెక్కన బన్నీ సినిమా పూర్తయ్యే వరకు ఖైదీ 2, రోలెక్స్ ప్రాజెక్టులు ప్రారంభం కావడం కష్టమే. కార్తీ, సూర్య ఇద్దరూ లోకేశ్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికీ.. ఆయన ప్రస్తుత ప్రాజెక్టుల కారణంగా మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి కోలీవుడ్ బ్రదర్స్ తమ అభిమాన దర్శకుడి కోసం ఎదురుచూస్తూనే ఉంటారా? లేదా హోప్స్ వదిలేసుకుంటారా? అన్నది చూడాలి.

