కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేవలం 47 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం శాండల్‌వుడ్‌లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
దిలీప్ రాజ్ సినీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. 2007లో పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మిలానా’లో దిలీప్ పోషించిన పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘యు-టర్న్’ వంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఆయన తన ముద్ర వేశారు. డీఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై పలు విజయవంతమైన సీరియళ్లను నిర్మించడమే కాకుండా, కొన్నింటిలో ప్రధాన పాత్రల్లో నటించి ఇంటింటికీ చేరువయ్యారు. ఇటు నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా తన ప్రతిభను చాటుకున్న దిలీప్ రాజ్ మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోవడం కన్నడ ఇండస్ట్రీకి పెద్ద లోటు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
