Kalyan Ram: శుక్రవారం విడుదలై విజయపథంలో సాగిపోతున్న ‘బింబిసార’ చిత్రం గురించి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేశారు. ఇంతకాలంగా తనకు దన్నుగా నిలిచి ప్రేమను అందించిన చిత్రసీమకు చెందిన స్నేహితులకు, మీడియాకు, శ్రేయోభిలాషులకు, సినీ ప్రేమికులకు, నందమూరి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ‘బింబిసార’కు ఇవాళ లభించిన విజయం యావత్ సినిమా రంగానికి చెందిన విజయంగా కళ్యాణ్ రామ్ అభివర్ణించారు. ఈ సందేశంలో కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ చిత్ర ప్రయాణం గురించి తలుచుకున్నారు. ఎంతో ఉత్సాహంతో 2019లో ‘బింబిసార’ చిత్రానికి శ్రీకారం చుట్టామని, ఆ తర్వాత కొవిడ్ 19 రూపంలో పలు విపత్తులను ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు.
అద్భుతమైన కథను ఈ ప్రపంచానికి తెలియచేయాలనే తమ తపనకు కరోనా అడ్డుగా నిలిచిందని, అయినా ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వాలనుకున్న తమ ఉత్సాహాం ఏ మాత్రం తగ్గలేదని కళ్యాణ్ రామ్ తెలిపారు. చిత్ర రూపకల్పనలో భాగస్వాములైన సాంకేతిక నిపుణుల తాపత్రయం, భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించడంతో ప్రేక్షకులు ఎలా దీనిని స్వీకరిస్తారనే విషయంలో ఎంతో ఆసక్తి ఉండేదని ఆయన అన్నారు. అయితే సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుండి లభించిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చూశాక ఎంతో ఆనందం, స్వాంతన లభించాయని చెప్పారు. ఈ సందర్భంగా ‘బింబిసార’ను ఆదరిస్తున్న అందరికీ కళ్యాణ్ రామ్ ధన్యవాదాలు తెలిపారు.
