Site icon NTV Telugu

NTR Film Awards: వైభవంగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

Kalavedika Awards

Kalavedika Awards

స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమర్పణలో, ప్రముఖ సంస్థ కళావేదిక నిర్వహణలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సీబీజె కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సీనియర్ నిర్మాత శ్రీ ఆర్వీ రమణమూర్తి గారి ఆశయ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న భువన రాయవరపు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ‘ఎన్టీఆర్ దేశ్ రక్షక్ అవార్డులు’ను త్రివిధ దళాలకు చెందిన సైనిక అధికారులకు అందజేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన సైనిక అధికారులకు ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. మేజర్ జనరల్ ఎన్.ఎస్. రావు, మేజర్ భరత్, గ్రూప్ కెప్టెన్ పి.ఆర్. ప్రసాద్, కెప్టెన్ టి.ఎన్. సాయికుమార్‌లు విశిష్ట అతిథుల చేతుల మీదుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్టీఆర్ దేశ రక్షక్ అవార్డులను అందుకున్నారు.

Rajendra Prasad: 15 రోజుల వెకేషన్లో సినిమా చేస్తే ఏడాది ఆడింది

అలాగే, కళావేదిక సంస్థ అందించే ఎన్టీఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను సీనియర్ నిర్మాతలు శ్రీమతి ఎన్.ఆర్. అనురాధ, శ్రీ చదలవాడ శ్రీనివాసరావు అందుకున్నారు. ఈ సందర్భంగా, కళావేదిక సంస్థ రూపొందించిన ‘నట సార్వభౌముడు’ ప్రత్యేక సంచికను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ తనయుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీ నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత నటుడికి కొడుకుగా పుట్టడం తన అదృష్టమని, పేద రైతు కుటుంబం నుంచి వచ్చి అద్వితీయ నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రి స్థానంలో నిలబడటం అరుదైన విషయమని అన్నారు.

Shashtipoorthi Review: షష్టిపూర్తి రివ్యూ  

సినీ నటుడిగా ఉన్నప్పుడే ప్రజల కోసం తపన పడి, యావత్ ప్రజలను ఒక తాటిపై నిలిపి సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కరువు వచ్చినా, తుఫాను వచ్చినా, యుద్ధం వచ్చినా, ప్రజలను కదిలించి నిధులు సేకరించి ప్రభుత్వానికి అందజేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని ఆయన అన్నారు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న సంక్షేమ పథకాల రూపకర్త ఎన్టీఆరేనని కొనియాడారు. అలాంటి మహానుభావుడికి నివాళిగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం, రియల్ హీరోలైన సైనిక అధికారులను సత్కరించడం మామూలు విషయం కాదని, కళావేదిక నిర్వాహకురాలు భువన రాయవరపును అభినందించారు.

Exit mobile version