Kaaka Update: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికాతో ‘మెగాస్టార్’ మాస్ స్టెప్పులు!

Chiranjeevi, Rithika Singh

Chiranjeevi, Rithika Singh

Chiranjeevi, Rithika Singh in Kaka Special Song: ‘మెగాస్టార్’ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘కాకా’ ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక గీతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ‘గురు’ ఫేమ్ రితికా సింగ్‌తో కలిసి చిరంజీవి ఈ పాటలో సందడి చేసినట్లు తెలుస్తోంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో కాకా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ, కూతురి అనుబంధం ప్రధానంగా సాగే కథకు భారీ యాక్షన్ సన్నివేశాలను జోడించి బాబీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో చిరంజీవి ‘సూపర్వైజర్ సత్యం’, ‘కదిరి కాళిదాస్’ అనే రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాట చిత్రీకరణ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ఈ పాటను చిత్రీకరించినట్లు సమాచారం. ఇందులో రితికా సింగ్‌తో కలిసి చిరంజీవి స్టెప్పులు వేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు నృత్యరీతులు అందించారట. తనదైన స్టైల్, ఎనర్జీతో చిరంజీవి ఈ పాటలో అదరగొట్టారని.. ఈ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్రవర్గాల సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

కాకాలో చిరంజీవి కూతురి పాత్రలో మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు. ప్రియమణి, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా కనిపించనుండగా.. మలయాళ స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో కాకాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.