JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి

Jd Chakravarthy

Jd Chakravarthy

JD Chakravarthy: టాలీవుడ్‌లో తన నటన, దర్శకత్వంతో ఒక విలక్షణమైన ముద్ర వేసిన హీరో జేడీ చక్రవర్తి. సుమారు 36 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆయన NTV పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో జేడీ చక్రవర్తి తన 36 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంపై స్పందించారు. తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలను, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని, తన దైనందిన జీవనశైలిని వివరించారు.

రామ్ గోపాల్ వర్మతో విడదీయలేని బంధం..
తన కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. “ఆర్జీవీ ఒక ‘యాక్టర్స్ డైరెక్టర్’. ఆయనతో పని చేయడం అంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే కాదు, ఒక బలమైన స్నేహం” అని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ చిత్రం ఎప్పటికీ తన కెరీర్‌లో నెంబర్ వన్ అని, ఆ తర్వాత ‘మనీ’, ‘సత్య’ వంటి చిత్రాలు తనను నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లాయని తెలిపారు. సినిమా విజయంలో కంటెంట్ పాత్ర గురించి మాట్లాడుతూ.. “కంటెంట్ అనేది రాణి అయితే, దాన్ని తెరకెక్కించే దర్శకుడు రాజు. సినిమా రిజల్ట్ గురించి నేను ఎప్పుడూ అతిగా ఆలోచించను. హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆ నిర్ణయం నాదే కాబట్టి బాధ్యత కూడా నాదే” అని స్పష్టం చేశారు. తాను సినిమాల్లోకి హీరో అవుదామని వచ్చానని, శివ సినిమా తర్వాత దాదాపు 30 నుంచి 40 సినిమాల వరకు రిజెక్ట్ చేశానని చెప్పారు. వైఫల్యాల నుంచి కూడా తాను ఎంతో నేర్చుకున్నానని, తన జీవితంలో ప్రతి నిర్ణయం తనదేనని స్పష్టం చేశారు.