Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..

Jayam Ravi Press Meet,

Jayam Ravi Press Meet,

భార్య ఆర్తితో విడాకుల ప్రకటన వచ్చినప్పటి నుండి హీరో జయం రవి పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ వివాదంలోకి సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ పేరు రావడం, ఆమెపై సోషల్ మీడియాలో హత్యా బెదిరింపులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కెనీషా.. తాజాగా రవితో రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్తూ, చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్ళిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఈ పరిణామాల అనంతరం మీడియా ముందుకు వచ్చిన జయం రవి, కన్నీరు మున్నీరవుతూ తన 14 ఏళ్ల నరకప్రాయమైన వైవాహిక జీవితాన్ని, ఆస్తుల వివాదాన్ని, తన జీవితాన్ని నాశనం చేసిన వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీడియా సాక్షిగా జయం రవి తన ఆవేదనను వెళ్లగక్కుతూ.. ‘గత 14 ఏళ్ల నా వైవాహిక జీవితంలో నేను ఒక బానిసలా బతికాను. నేను  కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులన్నీ నా భార్య వైపు వాళ్లే ఉంచుకున్నారు. కనీసం నా పేరు మీద ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ఇల్లు వదిలి వచ్చేటప్పుడు నా చేతిలో రూపాయి లేదు, నా సొంత డబ్బును నా ఇష్టప్రకారం ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ కూడా నాకు ఇవ్వలేదు. ప్రస్తుతం నేను ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాను’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అలాగే 45 ఏళ్ల వయసులో తాను అమ్మాయిల వెంట పడాల్సిన అవసరం లేదని, సినిమాల్లో మహిళల హక్కుల గురించి మాట్లాడే తాను, మహిళలను ఎప్పుడూ తప్పుగా మాట్లాడనని.. తనను అర్థం చేసుకుని తోడుగా నిలిచిన కెనీషాను కూడా టార్గెట్ చేసి మానసిక వేధింపులకు గురిచేసి పంపించేశారని ఆయన మండిపడ్డారు.

తన పిల్లల గురించి మాట్లాడుతూ రవి ‘నా పిల్లల కోసమే నేను ఇన్నాళ్లూ అన్ని భరిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు కనీసం నా పిల్లలను కూడా చూడనివ్వడం లేదు. వాళ్లను స్కూలుకు కూడా సెక్యూరిటీ గార్డుల కాపలా ఉంచుతున్నారు’ అని ఏడ్చేశారు రవి. ఇదే క్రమంలో ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నటిపై ఆయన షాకింగ్ ఆరోపణలు చేశారు.. ‘ఆ మూడక్షరాల ఇడ్లీ నటి ఒకరు నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసింది.  నేను అనుకుంటే ఒకే రోజులో విడాకులు తీసుకునేవాడిని, కానీ నా పిల్లల కోసమే మౌనంగా ఉన్నా. ఇకనైనా నన్ను రెచ్చగొట్టవద్దు’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఆ ‘మూడక్షరాల నటి’ ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు, ఆరా తీయడాలు మొదలయ్యాయి. అలాగే తన వ్యక్తిగత జీవితం పూర్తిగా గాడిలో పడేవరకు, ఈ సమస్యలన్నీ సర్దుమణిగే వరకు తాను సినిమాల్లో నటించబోనని, సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు జయం రవి స్పష్టం చేశారు. ఒక స్టార్ హీరో మీడియా ముందు ఇలా ఆస్తులు, పిల్లల కోసం ఏడవడం కోలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.