జబర్దస్త్ వేదికపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవ్వించే ముఖంలో సీరియస్ నెస్.. చేతులకి సంకెళ్లు.. పక్కన ఓ కానిస్టేబుల్.. చుట్టూ దట్టమైన అడవి.. చూస్తుంటేనే ఏదో పెద్ద మిస్టరీ దాగున్నట్లు అనిపిస్తోంది కదూ! అవును, ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ఆసక్తికరమైన గ్రిప్పింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ నందినీ రెడ్డి చేతుల మీదుగా తాజాగా విడుదల చేశారు. ఈ సరికొత్త ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ చిత్ర యూనిట్‌కు ఆమె ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మిస్తున్న ఈ వైవిధ్యమైన చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ‘డెస్టినీ’ (విధి) అనే టైటిల్‌కు తగ్గట్టుగానే పోస్టర్ డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓ అటవీ మార్గంలో సంకెళ్లతో ఉన్న ఇమ్మాన్యుయేల్, అతన్ని తీసుకెళ్తున్న కానిస్టేబుల్.. వీరిద్దరి చుట్టూనే కథ మొత్తం తిరగబోతోందని టైటిల్ లోగోలో కూడా ఆ ఇద్దరినే హైలైట్ చేయడం ద్వారా దర్శకుడు స్పష్టం చేశాడు. ఒక ఖైదీ, ఒక పోలీసు మధ్య సాగే ఈ థ్రిల్లింగ్ జర్నీ ఎక్కడికి దారితీసిందనేదే ఈ మూవీ ప్రధానాంశంగా అర్థమవుతోంది. ఇప్పటివరకు కామెడీ పాత్రల్లోనే కనిపించిన ఇమ్మాన్యుయేల్, ఇలా ఒక రా అండ్ సీరియస్ గెటప్‌లో కనిపించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సస్పెన్స్ డ్రామాలో ఇమ్మాన్యుయేల్‌తో పాటు శ్రీ సత్య, సీనియర్ నటి ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

