దశాబ్దాలుగా.. భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన స్వరాలతో మాయ చేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ఇటీవల విజయవాడలో జరగబోయే తన లైవ్ కచేరీ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన సంగీత ప్రయాణం, మారుతున్న కాలం, నేటి సంగీత ధోరణులపై హృదయానికి హత్తుకునే మాటలు చెప్పారు.
Also Read :Prithviraj Sukumaran : లోకల్ పుష్ప అవతారంలో పృథ్వీరాజ్.. ‘విలాయత్ బుద్ధ’పై భారీ క్రేజ్!
ఇళయరాజా మాట్లాడుతూ..
“నా జీవితంలో జరిగినవన్నీ పాటలే. మాట్లాడటానికి ఇప్పుడు మాటలు లేవు. నా పాటలే మాట్లాడుతున్నాయి. నా పాటల్లో జీవం ఉంది, ఎమోషన్ ఉంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో నా పాటలు ఏదో ఒక సందర్భంలో భాగం అయ్యాయి. నా పాటల్లో జీవం ఉంది, ఎమోషన్ ఉంది. అందుకే అవి గుండెల్లోకి, మనసులోకి వెళ్లిపోతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో నా పాటలు ఏదో ఒక సందర్భంలో భాగం అయ్యాయి’ అని భావోద్వేగంగా చెప్పారు.
ఇప్పటి సంగీత ధోరణులపై మాట్లాడుతూ..
“ఇప్పుడు వచ్చే పాటలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు. మేల్ సింగర్ పాడినా ఫీమేల్‌కి తెలియదు, ఫీమేల్ పాడినా మేల్‌కి తెలియదు. దర్శకుడికే ఏ పాట వస్తుందో తెలియని పరిస్థితి. మా కాలంలో మాత్రం ప్రతి పాట ఒక టీమ్‌వర్క్ ఫలితం. దాదాపు 80 మంది ఆర్కెస్ట్రాతో ఒకే చోట కూర్చుని పాటలు కంపోజ్ చేసేవాళ్లం. చెప్పాలి అంటే ఆ రోజుల్లో రికార్డింగ్ అంటే పండగలా ఉండేది. ఎవరు ఏ పాట పాడాలో నేను రాసి ఇస్తా. నిర్మాతలు పిలిచి రిహార్సల్స్ చేయించి, కరెక్ట్‌గా వచ్చినప్పుడు మాత్రమే పాట బయటకి వెళ్తుంది. 60 మంది ఒకే దిశగా కృషి చేస్తే నాలుగు నిమిషాల పాటలో జీవం పుట్టేది. కానీ ఇప్పుడు సంగీతం చేసే వాళ్లు ఒకే లైన్‌లో ఉండటం లేదు. ఒకరికొకరు కనెక్ట్ అయ్యే ఫీలింగ్ లేకపోవడం వల్ల ఆ పాటలపై ఆసక్తి తగ్గిపోతోంది” అన్నారు.
చివరిగా తన విజయవాడ లైవ్ కచేరీ గురించి మాట్లాడుతూ ..
“విజయవాడలో ఇది నా మొదటి లైవ్ ప్రోగ్రాం. రేపు కచేరీకి వచ్చే వారు నా పాటల్లో ఉన్న ఆ హృదయానుభూతిని, ఆ ఎమోషన్‌ను ప్రత్యక్షంగా అనుభవిస్తారని నమ్ముతున్నా,” అని ఇళయరాజా తెలిపారు.