మనకు తెలియని ప్రతి విషయాన్ని తెలియజేసి గూగుల్ నేడు ప్రపంచానికి ఒక విడదీయరాని భాగంగా మారింది. సాధారణ సమాచారం, సైన్స్ అండ్ టెక్నాలజీ వివరాలనో, లేక వినోదం సంబంధిత కంటెంట్‌నో – ఏదైనా కావాలన్నా గూగుల్‌లో వెతికితే క్షణాల్లో దొరుకుతుంది. కానీ గూగుల్ ఇమేజెస్ అనే ఫీచర్ ఎలా పుట్టింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటి? అనేది చాలామందికి తెలియదు. ఇది ప్రారంభమైనది 2000 గ్రామీ అవార్డ్స్ వేడుకలో. ఆ వేడుకకు హాజరైన అమెరికన్ గాయని, నటి జెన్నిఫర్ లోపెజ్ ఆకుపచ్చ రంగులోని వెర్సాస్ జంగిల్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఆ గౌన్ ఆ రాత్రి మొత్తం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఆ డ్రెస్ ఫొటోలు చూడాలనే ఉత్సాహం వల్ల ఇంటర్నెట్‌లో మిలియన్ల మంది ఒకేసారి సెర్చ్ చేయడం మొదలెట్టారు. కానీ ఆ సమయంలో గూగుల్‌లో ఫొటోలు చూపించే ఆప్షన్ లేకపోవడంతో, యూజర్లు విపరీతంగా నిరాశ చెందారు.
Also Read : OG : ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్..!
ఈ సంఘటన గూగుల్ యాజమాన్యానికి కొత్త ఆలోచన కలిగించింది. “ప్రజలు కేవలం కథనాలు చదవడం మాత్రమే కాదు, ఎక్కువగా ఫోటోలు చూడాలని కోరుకుంటున్నారు” అని గ్రహించారు. అప్పటి గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్ దీన్ని గుర్తించి, వెంటనే ఒక ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ అవసరం ఉందని నిర్ణయించారు. దీంతో గూగుల్ ఇమేజెస్ ఆవిష్కృతమైంది. 2001 జూలైలో అధికారికంగా ప్రారంభమైన గూగుల్ ఇమేజెస్ మొదటి దశలోనే 250 మిలియన్ల ఫోటోలు యూజర్లకు అందించింది. అప్పటినుంచి ఇది రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ, నేడు సెలబ్రిటీ ఫ్యాషన్ నుంచి ల్యాండ్‌మార్క్‌లు, ఫుడ్, ఆర్ట్, మీమ్స్ వరకు అన్నింటినీ మన కళ్లముందు ఉంచుతోంది. అంటే, ఒక స్టార్ ధరించిన ఒక డ్రెస్‌నే గూగుల్‌లో విప్లవాత్మక మార్పుకు కారణం అయిందని చెప్పాలి. జెన్నీఫర్ లోపెజ్ గ్రీన్ వెర్సాస్ డ్రెస్ కేవలం ఫ్యాషన్ హిస్టరీ లోనే కాదు, టెక్నాలజీ హిస్టరీలో కూడా ఒక మైలురాయిగా నిలిచిపోయింది.