NTV Telugu Site icon

`మోసం గురూ`అంటున్న ఫ‌హ‌ద్ అభిమానులు!

ప్ర‌ముఖ మ‌ల‌యాళ చిత్ర ద‌ర్శ‌కుడు ఫాజిల్ త‌న‌యుడు ఫహ‌ద్ ఫాజిల్ కు ఇప్పుడు ఇంతా అంతా క్రేజ్ లేదు! మ‌ల‌యాళంలో డిఫ‌రెంట్ స్టోరీని ఏ ద‌ర్శ‌కుడైనా రాసుకున్నాడంటే… మొద‌ట వినిపించేది ఫహ‌ద్ ఫాజిల్ కే!! జంకూ గొంకూ లేకుండా త‌న‌కు స్క్రిప్ట్ న‌చ్చితే చాలు హ్యాపీగా ఆ సినిమా చేసేస్తాడు ఫ‌హ‌ద్. బేసిక‌ల్ గా ఫ‌హ‌ద్ కు బ‌ట్ట‌త‌ల‌. అయినా… విగ్గులాంటివి పాత్రోచితంగా త‌ప్పితే వాడ‌డు ఫ‌హ‌ద్. వీలైనంత వ‌ర‌కూ నేచుర‌ల్ హెయిర్ తోనే మెయిన్ టైన్ చేస్తుంటాడు. కానీ ఈ మ‌ధ్య ఫ‌హ‌ద్ కాస్తంత ఎక్కువ‌గా జుత్తును పెంచి, గెడ్డంతో ఉన్న ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. మ‌న‌కు తెలియ‌కుండా ఫ‌హ‌ద్ ఇంత జుత్తు ఎప్పుడు, ఎలా పెంచాడు అని కొంద‌రు సందేహిస్తే, మ‌రికొంద‌రు ఫ‌హ‌ద్ ఫాజిల్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమాలో ఈ గెట‌ప్ తోనే క‌నిపించ‌బోతున్నాడంటూ జోస్యం చెప్పేశారు.

ఫ‌హ‌ద్ తెలుగులో పుష్ప‌ సినిమాలో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. అలానే విక్ర‌మ్ పేరుతో క‌మ‌ల్ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ తెర‌కెక్కిస్తున్న మూవీలోనూ ఫ‌హ‌ద్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. కొంద‌రు ఈ సినిమాల కోస‌మే ఫ‌హ‌ద్ అంతలా జ‌త్తు పెంచాడ‌ని తేల్చారు. కానీ చివ‌ర‌కు తేలిందేమంటే… నిజంగా ఫ‌హ‌ద్ ఈ త‌ర‌హ‌లో జుత్తు పెంచ‌లేద‌ట‌. ఎవ‌రో అభిమాని త‌మ హీరోకు పొడుగాటి జుత్తు, భారీ గెడ్డం ఉంటే ఎలా ఉంటుంద‌ని ఫోటో షాప్ లో చేశాడ‌ట‌. అదే ఇప్పుడు వైర‌ల్ అయింద‌ని తెలిసింది. దాంతో మోసం గురూ అంటూ ఫ‌హ‌ద్ అభిమానులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.