Harish Shankar: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వేదికపైకి వచ్చారంటే మాటల తూటాలు, అనూహ్యమైన ప్రకటనలు ఖాయం. తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎవరూ అడగకుండానే, స్వయంగా తానే మైక్ తీసుకుని ఓ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మాతపై ఉన్న అపారమైన గౌరవంతో హరీష్ శంకర్ వేదికపైనే ఇచ్చిన ఈ ప్రామిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హర్ష్ రోషన్ హీరోగా నటించిన ‘తెల్ల కాగితం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరీష్ శంకర్.. నిర్మాత కృష్ణ అంకితభావాన్ని మనస్ఫూర్తిగా కొనియాడారు. “కృష్ణ గారికి సినిమా తప్ప వేరే ప్రపంచం, వ్యాపారం ఏమీ తెలియదు. ఉదయం నాలుగున్నర, ఐదు గంటలకే షూటింగ్ స్పాట్‌కు వెళ్లిపోయే వ్యక్తి ఆయన. ‘అరుణాచల్ క్రియేషన్స్’ బ్యానర్ లోగోను నేనే స్వయంగా డిజైన్ చేశాను. వాస్తవానికి ఈ సంస్థలో మొదటి సినిమా నేనే చేయాల్సింది. కానీ కాల్షీట్లు, టైమ్‌లైన్స్ కుదరకపోవడంతో అది సాధ్యం కాలేదు. అయితే ఈ రోజు కృష్ణ గారిని అడగకుండానే నేనే స్వయంగా చెబుతున్నాను.. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌లో కచ్చితంగా నా సినిమా ఉంటుంది. ఇది నా ప్రామిస్” అంటూ కుండబద్దలు కొట్టారు. తనను నిలబెట్టిన మనుషులను ఎప్పటికీ మర్చిపోని హరీష్ శంకర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే వేదికపై హీరో హర్ష్ రోషన్ గురించి కూడా హరీష్ శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. “బండ్ల గణేష్ వాళ్ల అమ్మాయి సంగీత్‌లో రోషన్‌ను కలిసినప్పుడు.. సినిమాల ట్రెండ్స్, విశ్లేషణలపై వాడు మాట్లాడుతుంటే అరగంట పాటు ఆశ్చర్యపోయి వింటూ నిలబడిపోయాను. కోన వెంకట్ గారు రోషన్ పెద్ద మేధావి అని చెప్పారు కానీ.. నేను మాత్రం మహా ముదురు అంటాను. తెరపై కనిపించేంత అమాయకుడు మాత్రం కాదు” అంటూ చమత్కరించారు. అలాగే పరిశ్రమలో మోస్ట్ బిజీ రైటర్‌గా మారిన నందు త్వరలోనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారబోతున్నాడని, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని చెబుతూ చిత్ర యూనిట్‌కు హరీష్ శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. బాక్సాఫీస్ వద్ద చిన్న, పెద్ద చిత్రాలన్నీ విజయవంతమై చిత్ర పరిశ్రమ మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

