Site icon NTV Telugu

దేనికైనా సై అంటున్న ఆది పినిశెట్టి!

(డిసెంబర్ 14న ఆది పినిశెట్టి బర్త్ డే)
ఆరడుగులకు పైగా ఎత్తు, చక్కని శరీరసౌష్టవం- అటు ప్రతినాయకునిగానైనా అలరించగల నేర్పు, ఇటు కథానాయకునిగానూ మెప్పించగల ఓర్పు రెండూ ఉన్నాయి ఆది పినిశెట్టిలో. చూడగానే ఇట్టే ఆకట్టుకొనే రూపంతో ఆది పినిశెట్టి తనకు లభించిన పాత్రలకు న్యాయం చేసుకుంటూ సాగుతున్నారు. ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. ఆది మాత్రం నటునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా ఆకట్టుకున్నారు ఆది పినిశెట్టి.

ఆది పినిశెట్టి 1982 డిసెంబర్ 14న జన్మించారు. ఆది కన్నవారు రవిరాజా పినిశెట్టి, రాధారాణి. ఆది తండ్రి రవిరాజా 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి ‘యముడికి మొగుడు’, బాలకృష్ణ ‘బంగారుబుల్లోడు’, వెంకటేశ్ ‘చంటి’, మోహన్ బాబు ‘పెదరాయుడు’, రాజశేఖర్ ‘మా అన్నయ్య’ వంటి సూపర్ హిట్, సూవర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. రవిరాజా బాటలో పయనిస్తూ ఆయన పెద్ద కొడుకు సత్య ప్రభాస్ దర్శకుడు అనిపించుకున్నారు. చిన్న కొడుకు ఆది మాత్రం నటనలో అడుగు పెట్టారు. తేజ దర్శకత్వంలో దాసరి నారాయణరావు నిర్మించిన ‘ఒక ‘వి’చిత్రం’ ద్వారా ఆది నటనలో ప్రవేశించారు. తరువాత కొన్ని తమిళ చిత్రాలలోనూ నటించారు ఆది. తెలుగులో “గుండెల్లో గోదారి, మలుపు, సరైనోడు, అజ్ఞాతవాసి, రంగస్థలం, యు టర్న్, నీవెవరో” వంటి చిత్రాలలో నటించారు ఆది. ‘సరైనోడు, అజ్ఞాతవాసి’ చిత్రాలలో విలన్ గా కనిపించిన ఆది, ‘రంగస్థలం’లో కేరెక్టర్ రోల్ లో మురిపించారు.

కీర్తి సురేశ్ తో కలసి ఆది నటించిన ‘గుడ్ లక్ సఖి’ డిసెంబర్ 31న విడుదల కానుంది. ‘క్లాప్’ అనే చిత్రంలోనూ, లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలోనూ ఆది నటిస్తున్నారు. ఈ సినిమాలతో ఆది ఏ తీరున అలరిస్తారో చూడాలి. మరిన్ని విలక్షణమైన పాత్రలతో ఆది ఆకట్టుకుంటారని ఆశించవచ్చు.

Exit mobile version