Hanuman Ansh: రూ.452 కోట్లు కొల్లగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. ‘హనుమాన్‌ అంశ్‌’ డైరెక్టర్ అసంతృప్తి!

Hanuman Ansh Director

Hanuman Ansh Director

Hanuman Ansh Director Vishal Chaturvedi: నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భక్తిరస చిత్రం ‘హనుమాన్‌ అంశ్‌’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. రూ.452.86 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇంతటి విజయాన్ని అందుకున్నప్పటికీ బాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి ఎలాంటి స్పందన రాలేదని దర్శకుడు విశాల్ చతుర్వేది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఎవరూ తనను పట్టించుకోలేదన్నారు. చిన్న సినిమా, కొత్త దర్శకుడి ప్రయత్నం కావడంతోనే బడా నిర్మాణ సంస్థలు ఈ విజయాన్ని గుర్తించలేదని అభిప్రాయపడ్డారు.

‘పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థలు అధికారిక ప్రకటనలు విడుదల చేయడం నేను చూశా. కానీ నా సినిమా విషయంలో మాత్రం ఒక్క పెద్ద నిర్మాణ సంస్థ కూడా స్పందించలేదు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు చాలామంది హనుమాన్‌ అంశ్‌ గురించి ప్రశంసిస్తున్నప్పటికీ.. బహిరంగంగా అభినందించిన వారు కొద్దిమందే. అందులో వరుణ్ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు ఉన్నారు. నా సినిమా విజయంపై ఏ ప్రముఖ స్టూడియో లేదా నిర్మాణ సంస్థ లేఖ రాయలేదు. అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు’ అని విశాల్ చతుర్వేది అసంతృప్తి వ్యక్తం చేశారు.

సినిమా సక్సెస్ కావాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరో లేదా పెద్ద నిర్మాణ సంస్థ తప్పనిసరి అనే అపోహను హనుమాన్‌ అంశ్‌ తొలగించిందని దర్శకుడు విశాల్ చతుర్వేది అనాన్రు. సినిమా అనేది ప్రజలకు సంబంధించిన మాధ్యమమని, ప్రేక్షకులే సినిమా బాగుందో లేదో నిర్ణయిస్తారన్నారు. గతంలో విమర్శకులు, సోషల్ మీడియా అభిప్రాయాలే ప్రేక్షకులపై ప్రభావం చూపేవని.. ఇప్పుడు ప్రేక్షకులే తమ నిర్ణయాన్ని స్పష్టంగా చెబుతున్నారని చతుర్వేది పేర్కొన్నారు. రామాయణ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు సినిమాను చూడలేదు. ప్రస్తుతం బిజీగా ఉండటం వల్ల సమయం దొరకలేదు. సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు.