Singa : అడవిలో గోపీచంద్ ఉగ్రరూపం.. ‘సింగ’ సంచలన పోస్టర్!

Singa

Singa

మ్యాచో స్టార్ గోపీచంద్ ఈసారి పక్కా మాస్, రా యాక్షన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ’ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ దట్టమైన, మిస్టీరియస్ అడవిలో రాతి గుట్టపై నిలబడి ఉన్న గోపీచంద్ రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. డార్క్ బ్లూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న గోపీచంద్ చేతిలో అత్యంత భయంకరంగా, వింతగా డిజైన్ చేసిన భారీ ఆయుధం.. ఈ సినిమాలో యాక్షన్ మారణహోమం ఏ స్థాయిలో ఉండబోతోందో హింట్ ఇస్తోంది హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వేసిన అత్యద్భుతమైన స్పెషల్ సెట్స్‌లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్, ముఖ్య సన్నివేశాలను చిత్ర బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌పై మేకర్స్ పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఇక డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్న తదుపరి షెడ్యూల్ కోసం మరింత భారీ స్థాయిలో సెట్స్ నిర్మిస్తున్నారు.

హీరోలకు యాక్షన్ సీన్స్‌ను డిజైన్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన వి. వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతుండటంతో, ‘సింగ’లో మునుపెన్నడూ చూడని యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన భావోద్వేగాలు, డ్రామా కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళ భామ అనార్కలి నాజర్ ఈ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతోంది. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఎక్కడా రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాంకేతికంగా కూడా ఈ సినిమాకు టాప్ టీమ్ పనిచేస్తోంది. సామ్ సీఎస్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, షామ్‌దత్ ఐఎస్‌సీ సినిమాటోగ్రఫీ, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ కానున్నాయి. రామకృష్ణ-మోనికా ద్వయం ప్రొడక్షన్ డిజైన్‌ను సమకూరుస్తున్నారు. కచ్చితంగా గోపీచంద్‌ కెరీర్‌లో ‘సింగ’ సరికొత్త బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.