డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సమయం చిక్కినప్పుడల్లా పూరి మ్యూజింగ్స్ ద్వారా తన మనసులోని మాటలను బయట పెడుతుంటాడు. ఓషో శిష్యుడైన పూరి చెప్పే మాటల్లో కొన్ని సార్లు వాస్తవం ఉన్నా, అందులోని నిక్కచ్చిదనం వల్ల అవి వివాదాస్పదం అవుతుంటాయి. అంతేకాదు… కొన్ని సందర్భాలలో చర్చనీయాంశాలు అవుతాయి. తాజాగా పూరి జగన్నాథ్ విడాకుల అంశంపై ఆసక్తికరమైన టాక్ ఇచ్చారు! భారీ అంచనాలు, అపరిమితమైన స్వేచ్ఛ విడాకులకు ప్రధాన కారణమని పూరి చెబుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ పేండమిక్ సిట్యుయేషన్ లో భార్యాభర్తలు అత్యధిక సమయం ఒకరితో ఒకరు గడపడం వల్ల కూడా అంచనాలు పెరిగి విడాలకుల వైపు వారి దాంపత్య జీవితం సాగుతోందని సిద్ధాంతీకరించాడు. అంతేకాదు…. పెళ్ళికి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరమని, కనీసం రెండేళ్ల పాటు అబ్బాయి, అమ్మాయి మధ్య ఓ అవగాహన ఏర్పడిన తర్వాతే పెళ్ళి చేసుకోవాలని, అలానే విడాకులకు ఉన్నట్టుగానే పెళ్ళికీ సరైన లీగల్ ప్రాసెస్ ఉండాలని చెబుతున్నాడు. ఒంటరిగా ఉండలేక పెళ్ళి చేసుకుంటే…. ఇక అంతే సంగతులు అని హెచ్చరిస్తున్నాడు పూరి జగన్నాథ్. భార్యాభర్తలు ఒకరితో ఒకరు నిజానికి అరగంట మించి మాట్లాడుకోలేరని, సో… మగవాళ్ళు వీలైనంత వరకూ తన స్నేహితులతో కబుర్లు చెబుతూ, టీవీ, వాట్స్ అప్ చూస్తూ టైమ్ పాస్ చేయాలని, అప్పుడే ఈ పేండమిక్ రోజులలో వివాహ బంధాన్ని భద్రంగా ఉంచుకోగలమని సలహా ఇస్తున్నాడు. మరి పూరి మాటలను ఎంతమంది ఆమోదిస్తారో, పాటిస్తారో చూడాలి.