తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, మాస్ మహారాజ్ రవితేజ 75వ చిత్రం ‘మాస్ జాతర’తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనుంది. తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు భాను భోగవరపు, సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త పాయింట్:
“మాస్ జాతరలో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో, ఒక కొత్త పాయింట్ కూడా ఉంటుంది. ఈ కథ రైల్వే పోలీస్ నేపథ్యంలో జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్, సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయి. థియేటర్‌లో ప్రేక్షకులు కొన్ని సర్ ప్రైజ్ లు చూడబోతున్నారు.”
టైటిల్ సూచించింది రవితేజ గారే:
“కథ విన్న తర్వాత, వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయని రవితేజ గారే ఈ ‘మాస్ జాతర’ టైటిల్‌ను సూచించారు. ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. అందుకే మాస్ అంశాలను మరిన్ని జోడించాను.”
కథకు ప్రేరణ:
“ఇది కల్పిత కథే. అయితే కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాలు, సంఘటనల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితోనే కథకు తగ్గట్టు కొన్ని సన్నివేశాలు రాసుకున్నాను.”
రవితేజ గారి 75వ చిత్రం:
“ఇది రవితేజ గారి 75వ చిత్రమని మాకు ముందు తెలియదు. సినిమా ఓకే అయిన తర్వాత లెక్కేస్తే 75వ సినిమా అని తెలిసింది. కథ బాగుంది, ఈ నెంబర్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సినిమా చేయమని రవితేజ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు.”
నవీన్ చంద్ర (శివుడు పాత్ర):
“నవీన్ చంద్ర గారు ‘శివుడు’ అనే శక్తివంతమైన ప్రతినాయక పాత్ర పోషించారు. ఈ పాత్ర కోసం వేరే నటుల పేర్లు పరిశీలించినా, చివరకు నవీన్ చంద్ర గారే సరైనవారనిపించింది. ప్రత్యేక మేకోవర్ చేసి ఫోటోషూట్ చేశాక, ఆ లుక్ అందరికీ నచ్చింది. నవీన్ గారు గొప్ప నటుడు. సినిమా విడుదలైన తర్వాత ‘శివుడు’ పాత్ర గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.”
శ్రీలీల (తులసి పాత్ర):
“తులసి పాత్ర కోసం వేరే హీరోయిన్ పేరు అనుకోలేదు. కథ రాస్తున్నప్పుడే మా అందరికీ శ్రీలీల గారే గుర్తుకొచ్చారు. ‘ధమాకా’ జోడి కాబట్టి ఆమెను తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు. ఆమె పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యముంది. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో శ్రీలీల గారు కొత్తగా కనిపిస్తారు. ‘గ్యాంగ్ లీడర్’ లో చిరంజీవి-విజయశాంతి గారి మధ్య సన్నివేశాలు ఎలాగైతే కామెడీ టచ్‌తో మాసీగా ఉంటాయో, ఇందులో రవితేజ-శ్రీలీల గారి మధ్య సన్నివేశాలు అలా ఉంటాయి.”
దర్శకత్వానికి కారణం: “నిజానికి ‘సామజవరగమన’ లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వాలనుకున్నాను. కానీ ఎక్కువమంది మంచి మాస్ కథ ఉంటే చెప్పమనేవారు. అలా రవితేజ గారిని దృష్టిలో పెట్టుకునే ఈ రైల్వే పోలీస్ కథని రాశాను.””రవితేజ గారు ఖాకీ డ్రెస్ వేసిన సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలుసు. దానిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను.”ట్రైలర్‌లో రవితేజ గారి ‘వెంకీ’, ‘ఇడియట్’ సినిమాల రిఫరెన్స్‌లు ఆయన ఐకానిక్ మూమెంట్స్‌ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అవి కథకి అడ్డుగా ఉండవు, అభిమానులు సెలబ్రేట్ చేసుకునేలా ఉంటాయి.”
నిర్మాత నాగవంశీ సహకారం: “ఒక కొత్త దర్శకుడిగా నేను ఎక్కడా రాజీపడకుండా ఉండటానికి నాగవంశీ గారు ఎంతో మద్దతుగా నిలిచారు. ఆరున్నర కోట్లతో స్టేషన్ సెట్, భారీ జాతర సెటప్‌ను వేయించారు. ఆయన సహకారం మరువలేనిది.” యాక్షన్ సన్నివేశాలు: “యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సన్నివేశాల కోసం రవితేజ గారు గాయాలైనప్పటికీ ఎంతో కష్టపడ్డారు. ఆయన సహకారం వల్లే ఒత్తిడి లేకుండా సినిమా పూర్తి చేయగలిగాను.” “రవితేజ గారి సినిమా నుండి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఉంటూనే ‘మాస్ జాతర’ చిత్రం కొత్తగా ఉంటుంది. హాస్య సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలను కొత్తగా రూపొందించాము.”
