Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!

Dhruv Vikram

Dhruv Vikram

Dhruv Vikram DV4: చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కెరీర్‌లో నాలుగో సినిమాగా మొదట ప్రకటించిన ‘DV4’ చుట్టూ గత కొన్ని నెలలుగా పెద్ద వివాదమే నడుస్తోంది. దర్శకుడు రమేష్ వర్మతో చేయాల్సిన సినిమా పెండింగ్‌లో ఉండగానే ధృవ్ విక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమాను ‘DV4’ పేరుతో ప్రకటించడం ఈ వివాదానికి కారణమైంది. ఈ వ్యవహారం ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లడంతో అసలు రమేష్ వర్మ సినిమా పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌పై నిర్మాతల నుంచి వచ్చిన కొత్త ప్రకటన మరోసారి ఆసక్తిని పెంచుతోంది.

శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ తాజాగా ధృవ్ విక్రమ్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘DV4’ను తమ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా ప్రకటించింది. పెన్ మూవీస్, ఆర్వీ స్టూడియోస్ భాగస్వామ్యంతో రూపొందనున్న ఈ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని జయంతిలాల్ గాడా సమర్పిస్తున్నారు. ధృవ్ విక్రమ్ యూత్‌ఫుల్ ఎనర్జీకి, రమేష్ వర్మ కమర్షియల్ మేకింగ్ స్టైల్‌కు కలయికగా ఈ సినిమాను భారీ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

తెలుగు, తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో సినిమాను రూపొందించనున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ధృవ్ విక్రమ్‌కు సరిపోయే పాత్రను రమేష్ వర్మ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండగా, ఇప్పుడు అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించడం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఈ ప్రకటన వెనుక గతంలో జరిగిన వివాదం మాత్రం ప్రస్తావించకుండా ఉండలేం. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందాల్సిన ఈ సినిమాకే ముందుగా ధృవ్ విక్రమ్ కెరీర్‌లో నాలుగో చిత్రంగా ‘DV4’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ ప్రాజెక్ట్ కోసం తమకు రూ.1 కోటి అడ్వాన్స్ చెల్లించామని, మ్యూజిక్ సిట్టింగ్స్, సెట్స్, నటీనటులు, టెక్నీషియన్లకు అడ్వాన్సులు వంటి ప్రీ ప్రొడక్షన్ పనులపై దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేశామని నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ నిర్మాతలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు గతంలో రిపోర్టులు వచ్చాయి.

ఆ తర్వాత ధృవ్ విక్రమ్ డెబ్యూ దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో సినిమాను ‘DV4’ పేరుతోనే ప్రకటించారు. జూలైలో ప్రారంభమైన ఈ సినిమాను మేకర్స్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా పేర్కొన్నారు. దీంతో ముందుగా రమేష్ వర్మ దర్శకత్వంలో ప్రకటించిన ప్రాజెక్ట్ నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే నటుడి రెండు సినిమాలకు ఒకే వర్కింగ్ టైటిల్ రావడంతో వివాదం మరింత పెద్దదైంది.

ఈ వ్యవహారం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు కూడా వెళ్లింది. ధృవ్ విక్రమ్ ముందుగా ఇచ్చిన కమిట్‌మెంట్‌ను పూర్తి చేయాలని, అప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ విషయంలో ముందుకు వెళ్లకుండా ఉండాలని SIFCC సూచించినట్లు గతంలో రిపోర్టులు వచ్చాయి. కొత్త సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా వివాదం పరిష్కారమయ్యే వరకు నిలిపివేయాలని ఛాంబర్ సూచించినట్లు సమాచారం.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నీలాద్రి ప్రొడక్షన్స్ నుంచి రమేష్ వర్మ, ధృవ్ విక్రమ్ కాంబినేషన్‌లో ‘DV4’ను మళ్లీ అధికారికంగా ప్రకటించడం ఆసక్తిని పెంచుతోంది. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పడం చూస్తే ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి పట్టాలెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో వచ్చిన SIFCC వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లే అనిపిస్తోంది. నటుడు విక్రమ్ స్వయంగా జోక్యం చేసుకుని ఇరువర్గాలతో మాట్లాడి రాజీ కుదర్చడంతో, ఫిల్మ్ ఛాంబర్‌లో ఉన్న ఫిర్యాదును ఉపసంహరించుకుని నిన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా రీ-లాంచ్ చేశారు. ఈ వివాద పరిష్కారానికి అనుగుణంగానే మైత్రీ మూవీస్ సంస్థ కూడా తమ చిత్ర షెడ్యూల్స్‌ను మార్చుకోగా, ధృవ్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా 2026 సెప్టెంబర్ 23న ఈ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.