Anirudh : గురువును మర్చిపోయిన రాక్‌స్టార్..అనిరుధ్ రిసెప్షన్‌కు ధనుష్ డుమ్మా?

Dhanush1

Dhanush1

కోలీవుడ్‌లో ఒకప్పుడు ప్రాణస్నేహితుల్లా, అన్నదమ్ముల్లా మెలిగిన స్టార్ హీరో ధనుష్, రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మధ్య ఇప్పుడు దూరం పెరిగిందా? తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నవంబర్ 11న గ్రీస్‌లో కావ్యతో ఘనంగా వివాహం చేసుకున్న అనిరుధ్, నిన్న చెన్నైలో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. అయితే, ఈ వేడుకలో ఎక్కడా ధనుష్ కనిపించకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీసింది. అసలు అనిరుధ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిందే ధనుష్. తన మాజీ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో వచ్చిన ‘3’ సినిమాతో బంధువైన అనిరుధ్‌కు తొలి అవకాశం ఇచ్చాడు ధనుష్. ఆ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి’ పాట రాత్రికి రాత్రే అనిరుధ్‌ను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసింది. అలాంటిది, తన కెరీర్‌కు పునాది వేసిన ధనుష్ లేకుండానే అనిరుధ్ పెళ్లి వేడుకలు ముగిసిపోవడం అభిమానులకు మింగుడు పడటం లేదు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గ్రీస్‌లో జరిగిన అనిరుధ్ పెళ్లికి ధనుష్ కొడుకులు హాజరయ్యారు. కానీ, చెన్నైలో జరిగిన రిసెప్షన్‌కు మాత్రం ధనుష్ రాలేదు. దీనికి తోడు, రెండు రోజుల క్రితం తన 15 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని అనిరుధ్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అందులో కనీసం ధనుష్ పేరును కూడా ప్రస్తావించకపోవడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు అనిరుధ్ తన పెళ్లికి, రిసెప్షన్‌కు ధనుష్‌ను పిలిచాడా? లేక పిలిచినా పాత విభేదాల వల్ల ధనుష్ కావాలనే ఈ వేడుకకు దూరంగా ఉన్నాడా? అనే ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు, ఈ వివాదాలేవీ పట్టించుకోని ధనుష్ తన 56వ సినిమా షూటింగ్ కోసం మదురై వెళ్లిపోయాడు. అక్కడ ఎయిర్‌పోర్టులో అభిమానులు పూలబొకేలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఏదేమైనా, ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌గా వెలిగిన వీరిద్దరి మధ్య మళ్లీ మునుపటి సాన్నిహిత్యం కనిపిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.