Dhanush OM: కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒకే సీజన్‌లో ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు బరిలోకి దిగితే థియేటర్ల కొరత, కలెక్షన్స్ షేరింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని స్టార్ హీరో ధనుష్ తీసుకున్న ఒక బోల్డ్ అండ్ మెచ్యూర్ డెసిషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్, వెర్సటైల్ స్టార్ సూర్య చిత్రాలతో తలపడకుండా తన సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ధనుష్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ధనుష్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ఓఎమ్’ తొలుత అక్టోబర్ 16న గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సరిగ్గా ఒక్క రోజు ముందు, అంటే అక్టోబర్ 15నే సూపర్ స్టార్ రజినీకాంత్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ థియేటర్లలోకి వస్తోంది. ఆ వెంటనే నవంబర్ 6 దీపావళి బరిలో సూర్య నటిస్తున్న ‘సీన్’ (Scene) చిత్రం సందడి చేయనుంది. ఈ క్రమంలో రెండు అతిపెద్ద ప్రాజెక్టుల మధ్య తన చిత్రాన్ని దింపడం వల్ల తమిళ చిత్ర పరిశ్రమ వ్యాపారానికే నష్టం వాటిల్లుతుందని గ్రహించిన ధనుష్.. ‘ఓఎమ్’ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
ఈ వాయిదాపై ధనుష్ రిలీజ్ చేసిన ప్రకటన అభిమానుల మనసులను గెలుచుకుంది. దీపావళి రేసులోకి సూర్య టీమ్ అందరికంటే ముందే తమ రిలీజ్ డేట్‌ను ప్రకటించిందని ధనుష్ గుర్తుచేశారు. తమిళ చిత్ర పరిశ్రమ శ్రేయస్సును కాంక్షిస్తూ, భారీ బడ్జెట్ చిత్రాల మధ్య పరస్పర గౌరవం, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బాక్సాఫీస్ పోటీ కంటే ఇండస్ట్రీ, అగ్ర తారల సినిమాల మనుగడే ముఖ్యమని చాటిచెప్పారు. రజినీకాంత్, సూర్యల పట్ల ధనుష్ చూపించిన ఈ గౌరవం, అభిమానానికి చిత్ర పరిశ్రమ ప్రముఖుల నుంచి విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. భారీ క్లాష్‌ను పక్కనపెట్టి తోటి హీరోల సినిమాలకు క్లీన్ రన్ ఇచ్చేలా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కోలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు స్వాగతిస్తున్నారు. ఇక ‘ఓఎమ్’ కొత్త విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ నిర్ణయంతో ధనుష్ నిజమైన హీరో అనిపించుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కొనియాడుతున్నారు.

