Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!

Dhanush's Om

Dhanush's Om

Om Movie: ధనుష్ హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓం’ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎర్రచందనం అక్రమ రవాణా, ఆ అండర్‌వరల్డ్ ప్రపంచాన్ని చూపించే కథేనా అనే సందేహాలు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ అంశంపై పూర్తి స్పష్టతనిచ్చారు.

ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే రొటీన్ క్రైమ్ స్టోరీ కాదని, అత్యంత లోతైన ఎమోషన్లతో సాగే సినిమా అని ఆయన తేల్చి చెప్పారు. కథ నేపథ్యాన్ని వివరిస్తూ.. “ఒక చెట్టుకు ఎన్నో కొమ్మలు విస్తరించి ఉన్నట్లే.. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎందరో మనుషులు ఏదో ఒక బలమైన అంశంతో ఎలా ముడిపడి ఉన్నారన్నదే ఈ కథ” అని పేర్కొన్నారు. ఆయా పాత్రల జీవితాలు, వారి మధ్య ఉండే సంబంధాలు, బలమైన భావోద్వేగాల ప్రయాణమే ఈ చిత్రం అని ఆయన వెల్లడించారు. దర్శకుడి మాటలను బట్టి చూస్తే.. ఎర్రచందనం లాంటి అంశం కథాగమనానికి ఓ నేపథ్యం మాత్రమేనని, అసలైన కథ మాత్రం మనుషుల ఎమోషన్ల చుట్టూనే బలంగా తిరుగుతుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రం నవంబర్ 20న రిలీజ్ అవుతుంది.