బాలీవుడ్‌లో మరో సంచలనం రేపుతున్న వివాదం వెలుగులోకి వచ్చింది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ప్రస్తుతం లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ సిరీస్‌లో చూపించిన ఒక పాత్ర తన నిజజీవితాన్ని పోలి ఉందని, దానివల్ల తన ఇమేజ్ దెబ్బతింటోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే కోర్టును ఆశ్రయించారు.
Also Read : Rishab Shetty : తమిళనాడు కరూర్ ర్యాలీ ఘటనపై స్పందించిన రిషబ్ శెట్టి
సమీర్ వాంఖడే తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు – ఈ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత ప్రేక్షకులు తనను, తన కుటుంబాన్ని సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి తనతో ఎలాంటి సంబంధం లేకపోయినా, సిరీస్‌లో చూపిన పాత్రను తనతో పోల్చుతూ అనవసరమైన అపార్థాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాంఖడే తెలిపారు. ఇక ఈ కేసుపై దిల్లీ హైకోర్టు విచారణ జరిపి, నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, అలాగే స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీని అక్టోబర్ 30కి వాయిదా వేసింది. అప్పటివరకు ఈ అంశంపై మేకర్స్ తమ వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన వెబ్ సిరీస్. అయితే ఇప్పుడు లీగల్ వివాదంలో చిక్కుకోవడంతో మరోసారి ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ఈ కేసు తీర్పు కోసం సినీ, లీగల్ వర్గాలు ఎదురుచూస్తుండగా, మరోవైపు ఈ వివాదం కారణంగా సిరీస్‌కి అనుకోని పబ్లిసిటీ కూడా లభిస్తోంది.
