December 4 Box Office Clash in Kollywood: డిసెంబర్ మొదటి వారంలో టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది. డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ‘ఫౌజీ’ వాయిదా పడడంతో.. టాలీవుడ్ యంగ్ హీరోలకు లైన్ క్లియర్ అయింది. నాగ చైతన్య, నితిన్, విశ్వక్ సేన్ వంటి హీరోలు డిసెంబర్ ఫస్ట్ వీక్పై కన్నేశారు. అయితే కోలీవుడ్లో మాత్రం ఈ పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. ఒకే రోజున ముగ్గురు హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. విజయ్ సేతుపతి, ఆర్య, మణికందన్ బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు.
విజయ్ సేతుపతి నటించిన ‘ట్రైన్’ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. విజయ్ నటన, మిస్కిన్ దర్శకత్వం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు విడుదల తేదీపై వచ్చిన అప్డేట్ మంచి ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
విజయ్ సేతుపతితో పోటీ పడేందుకు ఆర్య కూడా సిద్ధమయ్యాడు. తన 40వ సినిమాగా తెరకెక్కుతున్న ‘హలో కాదల్’ను డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. నిఖిలా విమల్, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రణయ విలాసం’తో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ మురళీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆర్య భావిస్తున్నాడు.
విజయ్ సేతుపతి, ఆర్య సినిమాల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్న సమయంలో మణికందన్ కూడా బరిలోకి దిగుతున్నాడు. ‘గుడ్ నైట్’, ‘లవర్’, ‘కుడుంబస్తాన్’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మణికందన్ ఈసారి సీరియస్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘మక్కల్ కావలన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషియో పొలిటికల్ యాక్షన్ డ్రామా డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో మణికందన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. దర్శకుడు పా. రంజిత్ ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు.
డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’, ఆర్య ‘హలో కాదల్’, మణికందన్ ‘మక్కల్ కావలన్’ సినిమాలు ఒకే రోజు విడుదలైతే కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొననుంది. ఒకవైపు థ్రిల్లర్, మరోవైపు ప్రేమకథ, ఇంకోవైపు సామాజిక రాజకీయ అంశాలతో కూడిన యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ మూడు సినిమాల్లో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది?. బాక్సాఫీస్ వద్ద ఎవరు పైచేయి సాధిస్తారు? అనే ఆసక్తి నెలకొంది. ఈ పోటీలో మరిన్ని సినిమాలు చేరతాయా? లేక ఈ ముగ్గురి మధ్యే బాక్సాఫీస్ వార్ కొనసాగుతుందా? అనేది తెలియాలంటే డిసెంబర్ మొదటి వారం వరకు వేచి చూడాల్సిందే.

