కల్ట్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతుల మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ లాంచ్ కావడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారాహి ఆర్ట్స్ బ్యానర్‌పై రావి సౌజన్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి జీడీ నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్‌లో వినిపించిన భావోద్వేగభరితమైన సంభాషణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. “కొన్ని ప్రేమ కథలు కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటాయి.. కానీ కొన్ని కథలు కాలం ఉన్నంత వరకు గుర్తుంటాయి.. నువ్వు నాకు ఎదురైన ప్రతీసారి కాలం కూడా ఒక్క క్షణం ఆగిపోయి చూసేది. నా చివరి శ్వాస వరకు.. నా గుండె కొట్టుకున్న ప్రతీసారి ఆ చప్పుడు చెప్పే ఒకే ఒక్క పేరు.. నీదే.
బతికుంటే నీ ప్రేమతో.. ఊపిరి ఆగితే నీ జ్ఞాపకాలతో.. ప్రతీ ప్రేమ కథ ముగింపు వరకు వెళ్లలేకపోవచ్చు.. కానీ నిజమైన ఏ ప్రేమ అయినా చరిత్రలో అలా గుర్తుండిపోవాల్సిందే.. మన ప్రేమలా” అంటూ సాగిన ఈ మోషన్ పోస్టర్ నరేషన్ సినిమాలోని డెప్త్‌ను, ఇంటెన్స్‌ను స్పష్టం చేస్తోంది. స్వచ్ఛమైన ప్రేమ, విరహం నేపథ్యంలో ఈ కథ తెరకెక్కినట్లు ఈ డైలాగ్స్ ద్వారా అర్థమవుతోంది. ప్రాజెక్ట్ పట్ల ఇంప్రెస్ అయిన డైరెక్టర్ సాయి రాజేష్ చిత్ర యూనిట్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

