Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!

Anupama Parameswaran Latest Comments

Anupama Parameswaran Latest Comments

Anupama Parameswaran Latest Comments: అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. భద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్‌రాజ్‌, నరేశ్‌, తరుణ్‌ భాస్కర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదల కాగా.. గురువారం హైదరాబాద్‌లో చిత్ర బృందం విలేకర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అనుపమ తన సినిమాల ఎంపిక, నటనపై ఆసక్తి, భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను అని, ఓ నటిగా ఎప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. తన సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు భావించకూడదని, ప్రతి చిత్రంలోనూ తన పాత్ర ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటానని చెప్పారు.

‘ఓ నటిగా నేను ఎప్పుడూ వైవిధ్యభరితంగా ఉండాలని ప్రయత్నిస్తుంటా. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అస్సలు అనుకోకూడదు. నా పాత్రను చూసే ఆ సినిమా పేరేంటో వెంటనే ప్రేక్షకులు చెప్పగలగాలి. అంత ప్రత్యేకంగా ఉండేలా నా కథల్ని, పాత్రల్ని ఎంచుకుంటా. కేవలం డబ్బుల కోసమే నటించాలని అనుకోను. ఏదో కొత్తగా ప్రయత్నించాలనే ప్యాషన్‌ నన్ను నడిపించాలి’ అని అనుపమ పరమేశ్వరన్‌ చెప్పారు. ‘టిల్లు స్క్వేర్‌’, ‘పరదా’, ‘క్రేజీ కళ్యాణం’ వంటి విభిన్న చిత్రాల్లో నటించడం తనకు ఆనందాన్నిస్తుందని తెలిపారు. సినిమాలతో పాటు షార్ట్‌ ఫిల్మ్స్‌, రీల్స్‌ చేయడాన్ని కూడా ఆస్వాదిస్తానని చెప్పారు. కొత్త తరహా కథలు, పాత్రల ద్వారా తనలోని నటనా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చని అను అభిప్రాయపడ్డారు.

తెరపై కనిపించడం కంటే కెమెరా వెనుక పనిచేయడమంటే తనకు చాలా ఇష్టమని అనుపమ వెల్లడించారు. నటిగా తాను ఎక్కువ విషయాలు నేర్చుకున్నది కెమెరా వెనుక పనిచేసినప్పుడేనని చెప్పారు. 2019లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఇప్పటికీ తనకు ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఆ అనుభవం నటనతో పాటు కథలు, పాత్రలను ఎంచుకునే విషయంలోనూ ఎంతో సహాయపడుతోందని వివరించారు. ప్రస్తుతం తమిళం, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆ చిత్రాల్లో ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతతో ఉంటుందని.. కథలు, పాత్రల పరంగా భిన్నంగా ఉండబోతున్నాయని చెప్పారు. కొత్త ప్రయోగాలు చేయాలనే ఆసక్తే తనను ముందుకు నడిపిస్తోందని అను చెప్పుకొచ్చారు.