రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకి, ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారు? అనే చర్చలు మొదట్నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘అధికారి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారనే టాక్ వినిపించింది. ఇదే సమయంలో ‘విశ్వంభర’ అనే పేరు కూడా తెరమీదకొచ్చింది. అయితే.. ‘అధికారి’ టైటిల్ నే దాదాపు ఫిక్స్ చేయొచ్చని, అది కథకు సరిగ్గా సూటవుతుందని, ఫిలిం ఛాంబర్ లో ఆ టైటిల్ ను రిజిస్టర్ కూడ చేశారని ప్రచారం జరిగింది. కానీ, అధికార ప్రకటన మాత్రం రాలేదు.
ఇప్పుడు లేటెస్ట్ గా మరో కొత్త టైటిల్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు శంకర్ ఈ సినిమాకు ‘సిటిజెన్’ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నాడట. అధికారి కంటే, ఈ టైటిల్ మరింత సూట్ అవుతుందన్నది ఆయన అభిప్రాయం. అధికారి కన్నా ఓ దేశ పౌరుడిగా సామాజిక హక్కులపై పోరాటం కొనసాగిస్తేనే.. ఆడియన్స్ పై ఇంపాక్ట్ ఎక్కువ చూపుతుందన్నది శంకర్ భావన. అందుకే.. సిటిజన్ టైటిల్ మీదే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి, ఈ టైటిల్ ని ఫిక్స్ చేస్తారా? లేక మరో కొత్త పేరుతో ట్విస్ట్ ఇస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.
కాగా.. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇదివరకే ‘వినయ విధేయ రామ’లో కలిసి నటించిన చరణ్, కియారా.. ఇప్పుడు రెండోసారి వెండితెరను పంచుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో.. సునీల్, శ్రీకాంత్, జయరామ్, అంజలి, నవీన్ చంద్ర, తదితర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
