ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ‘సినిమా బండి’కి ఇప్పుడు మంచి స్పందన లభిస్తోంది. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్ నెంబర్ 1లో ఉండడం విశేషం. ఈ వైవిధ్యమైన చిత్రంతో ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం కాగా… ఈ చిత్రం ఆటో రిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్ కు తన ఆటో వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తన స్నేహితుడితో కలిసి మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడు. డి 2 ఆర్ ఇండీ బ్యానర్‌లో రాజ్, డికె ద్వయం ఈ చిత్రాన్ని నిర్మించారు. వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి, రాగ్ మయూర్, త్రిషర, ముని వెంకటప్ప, ఉమా జి, సిరివెన్నెల యనమంధల, సింధు శ్రీనివాసమూర్తి, పూజారి రామ్ చరణ్, దవని ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సిరిష్ సత్యవోలు సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు భారీ ప్రేక్షకాదరణ లభిస్తోంది.