Megaverse: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, పవన్, రామ్ చరణ్.. నెట్‌ఫ్లిక్స్‌లో మెగా సునామీ!

Chiranjeevi Megaverse

Chiranjeevi Megaverse

Megaverse: టాలీవుడ్ చరిత్రలో కనీవినీ ఎరుగని దృశ్యం త్వరలోనే డిజిటల్ స్క్రీన్‌పై ఆవిష్కృతం కాబోతోంది. ఒకవైపు హోస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి.. ఆయన ఎదురుగా కూర్చుని ముచ్చటించే గెస్ట్‌లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. దశాబ్దాలుగా కోట్లాది మంది మెగా అభిమానులు కంటున్న ఈ కలల ఫ్రేమ్ ఇప్పుడు ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా నిజం కానుంది. గ్లోబల్ ఓటీటీ దిగ్గజం రూపొందిస్తున్న సరికొత్త టాక్ షో ‘చిరంజీవీస్ మెగావర్స్’ ద్వారా ఈ అన్‌స్టాపబుల్ కాంబినేషన్ సెట్ కాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే ఎన్నో సెలబ్రిటీ టాక్ షోలు రికార్డు వ్యూస్ సాధించాయి. కానీ స్వయంగా మెగాస్టార్ హోస్ట్ సీట్లో కూర్చోవడం, ఆయనకు తోడుగా బాబాయ్-అబ్బాయ్ ఒకే ఫ్రేమ్‌లో దర్శనమివ్వడం అంటే అది మెగా ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రేమికులకు మామూలు విషయం కాదు. ఈ ఒక్క ఎపిసోడ్‌తో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్ అవ్వడం, డిజిటల్ రికార్డులు బూడిదవడం ఖాయమని సినీ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆయన నుంచి డేట్స్ లాక్ కాగానే ఈ మెగా ఎపిసోడ్ షూటింగ్‌ను చకచకా పూర్తి చేసేందుకు టీమ్ సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ షోలో మెగా ఫ్యామిలీతో పాటు మరో స్టార్ హీరో కుటుంబం కూడా మెగాస్టార్‌తో సందడి చేయబోతోంది. కింగ్ నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్‌లతో కలిసి హాజరైన ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం. దశాబ్దాల చిరంజీవి- నాగార్జునల స్నేహం, అక్కినేని కుర్రాళ్లతో చిరు చేసిన అల్లరి ఈ షో ప్రారంభానికి గ్రాండ్ ఓపెనింగ్ ఇవ్వనున్నాయని చెబుతున్నారు. ఈ లైనప్ ఇక్కడితోనే ఆగడం లేదు. పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాలను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేశారని చెబుతున్నారు. రాబోయే ‘స్పిరిట్’ మూవీ సెన్సేషన్ నడుమ వీరిద్దరితో చిరంజీవి జరిపే సంభాషణ డిజిటల్ తెరపై మరో బ్లాస్ట్‌ను సృష్టించనుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్ఎల్‌పి సంస్థలు అత్యంత భారీ హంగులతో, కళ్లు చెదిరే బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాయి.