టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేటకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత మెగాస్టార్, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #ChiruBobby2 / #Chiru158. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్‌డేట్‌తో పాటు మేకర్స్ వదిలిన బిహైండ్-ది-సీన్స్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పొల్లాచ్చి పరిసర ప్రాంతాలలో ప్లాన్ చేసిన మొదటి షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్‌పై కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులతో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్న కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. పొల్లాచ్చి షెడ్యూల్ ముగియడంతో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ఈ రోజు నుంచే హైదరాబాద్‌లో సరికొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది చిత్ర బృందం. ఈ తాజా షెడ్యూల్‌లో సినిమా కథకు వెన్నెముకలా నిలిచే ప్రధాన టాకీ పార్ట్, కొన్ని భారీ యాక్షన్ ఘట్టాలను షూట్ చేయనున్నారు.
పొల్లాచ్చి షెడ్యూల్ ముగిసిన సందర్భంగా విడుదల చేసిన BTS వీడియో ప్రేక్షకులకు, మెగా అభిమానులకు అసలైన పూనకాలు తెప్పిస్తోంది. ఈ వీడియోలో సినిమాను ఎంత గ్రాండ్‌గా, విజువల్ వండర్‌లా ప్లాన్ చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తోంది. చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత హుందాగా, హై-ఇంటెన్సిటీతో కూడిన సరికొత్త లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో మొత్తానికి హైలైట్‌గా నిలిచింది మాత్రం దర్శకుడు బాబీ ఎమోషనల్ మూమెంట్. షూటింగ్ సమయంలో ఒక సీన్ చేస్తున్నప్పుడు చిరంజీవి తన నటనతో పూర్తిగా లీనమైపోయారు. మెగాస్టార్ నటనకు ముగ్ధుడైపోయిన బాబీ కొల్లి అక్కడికక్కడే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి అద్భుత నటనను చూసి తట్టుకోలేక డైరెక్టర్ బాబీ.. ఉద్వేగంగా “జీవించేశారు అన్నయ్యా” అని అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

