Chiranjeevi: నాతో సినిమా చేస్తావా అని ఏ డైరెక్టర్‌ని అడగలేదు.. ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు!

Chiranjeevi Venky Kudumula

Chiranjeevi Venky Kudumula

Chiranjeevi Funny Comments on Venky Kudumula: కొత్త నటుడు అనీష్ రెడ్డి హీరోగా, మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు అర్జున’. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను కింగ్ నాగార్జున సమర్పించగా.. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించారు. భారీ బడ్జెట్‌తో, ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర బృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత వెంకీ కుడుముల గురించి చిరు చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వెంకీ కుడుములలో మంచి కామెడీ సెన్స్ ఉందని, ఆయన సినిమాలు తనకు నచ్చుతాయని చిరంజీవి చెప్పారు. ‘వెంకీ కుడుముల నిర్మాతగా కొత్త అవతారం ఎత్తాడు. ఓ రకంగా నాకు చాలా బాధగా ఉంది. వెంకీలో కామెడీ సెన్స్ బాగుంటుంది. అది నాకు బాగా నచ్చుతుంది. ఆయన సినిమాలు చూశాను. నేను ఎవరినీ నాతో సినిమా చేస్తావా అని అడగలేదు. కానీ ఈ దుర్మార్గుడిని మాత్రం అడిగాను. మంచి కథతో వస్తాను సర్ అని చెప్పాడు. అప్పటి నుంచి చాలా ఆశగా ఎదురుచూస్తున్నాను. ఆఖరికి నాకు హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇట్లు అర్జునకు నిర్మాతగా మారాడు’ అని చిరంజీవి నవ్వులు పూయించారు.

అంతటితో ఆగకుండా.. ‘పోనీ నాతో సినిమా నిర్మిస్తాడా అంటే.. యంగ్ స్టర్స్ కావాలట’ అంటూ వెంకీపై చిరు చమత్కరించారు. అనంతరం ‘నువ్వు కథ చెప్పడానికి వస్తావా? లేదంటే నా ఇంటి తలుపులు మూసేయనా?’ అని సరదాగా ప్రశ్నించారు. దీనికి వెంకీ స్పందిస్తూ.. ‘మీరు తలుపులు మూసేసినా.. నేను దూకి వస్తా సర్’ అంటూ బదులిచ్చారు. వెంకీ సమాధానంతో వేదిక మొత్తం నవ్వులతో మార్మోగింది. చిరంజీవి, వెంకీ కుడుముల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇట్లు అర్జున సక్సెస్ మీట్‌లో చిరు, వెంకీ మధ్య జరిగిన హాస్యభరిత సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.