Site icon NTV Telugu

Chiranjeevi : చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రయాణం.. ప్రాణం ఖరీదు జ్ఞాపకాలను పంచుకున్న మెగాస్టార్

Chirajeevi

Chirajeevi

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా వెలుగులు నింపిన ఈ మహానటుడు, నేడు తన సినీ ప్రయాణంలో ఓ గొప్ప మైలురాయిని చేరుకున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై నేటికి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరు ఒక భావోద్వేగ పోస్ట్‌ షేర్ చేశారు..‘22 సెప్టెంబర్‌ 1978.. నేను నటుడిగా మీ ముందుకు వచ్చాను. ప్రాణం ఖరీదు ద్వారా నాకు ప్రాణం పోసి, మీ అన్నయ్య‌గా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా, చివరికి మెగాస్టార్‌గా నిలిపింది మీ ప్రేమే. నేటికి 155 సినిమాలను పూర్తి చేసుకున్నాను అంటే అది మీ నిస్వార్థమైన అభిమానం వల్లే సాధ్యమైంది. ఈ 47 ఏళ్లలో నేను అందుకున్న అవార్డులు, గౌరవాలు అని మీవే. మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి’’ అని చిరు అభిమానుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : Bad Girl: ‘బ్యాడ్‌ గర్ల్‌’ అశ్లీలం కాదు..వివాదం పై స్పందించిన వార్షా భరత్

1978, సెప్టెంబర్ 22న కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) అనే యువకుడు ప్రాణం ఖరీదు ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. కె. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు నరసింహ అనే పాత్రలో నటించారు. రావుగోపాలరావు, జయసుధ, చంద్రమోహన్‌ వంటి ప్రముఖులతో కలిసి తెరపై కనిపించిన ఆయన, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే – చిరు కథానాయకుడిగా తొలుత చేసిన చిత్రం పునాది రాళ్లు. కానీ, షూటింగ్‌ త్వరగా పూర్తి అయిన ప్రాణం ఖరీదు ముందుగా విడుదల కావడం, ఆయన కెరీర్‌లో చారిత్రాత్మక మలుపుగా మారింది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో చిరంజీవి‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన నాలుగు చిత్రాల్లో బిజీగా ఉన్నారు. మన శంకర వరప్రసాద్ గారు – అనిల్‌ రావిపుడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. విశ్వంభర – దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో ప్రేక్షకులను అలరించ నుంది. వీటితో పాటు శ్రీకాంత్‌ ఓదెల, బాబీ దర్శకత్వంలో మరో రెండు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.

మొత్తానికి ప్రాణం ఖరీదు తో మొదలైన ప్రయాణం నేడు 47 ఏళ్ల కు చేరుకుంది.ఆయన ప్రతి అడుగు ఒక కొత్త తరానికి ప్రేరణ. అభిమానుల మద్దతుతో ముందుకు సాగుతున్న మెగాస్టార్ రాబోయే ప్రాజెక్టులతో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ, తెలుగు సినీ లోకమంతా ఆనందోత్సాహాలతో శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

Exit mobile version