అమెజాన్ ప్రైమ్‌లో చౌర్య పాఠం’ సరికొత్త సంచలనం సృష్టించింది. ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని అవలీలగా దాటేసి, డిజిటల్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేసినట్టు సినిమా టీమ్ వెల్లడించింది. ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతూ, డిజిటల్ రికార్డులు బద్దలు కొడుతొంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఓటీటీ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. సినిమాలో హీరోగా నటించిన ఇంద్ర రామ్ తన మొదటి సినిమాను నిర్మించాలనే తీవ్రమైన ఆకాంక్షతో, నిధుల కోసం ధనపల్లి అనే గ్రామంలోని బ్యాంకును దోచుకోవడానికి ఒక చిన్న ముఠాతో కలిసి పథకం వేసే దర్శకుడిగా అతడి నటన ఆకట్టుకుంటుంది.
పేరులో ‘చౌర్యం’ అని ఉన్నా, సినిమా చూశాక వచ్చే ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్. దొంగతనం చుట్టూ తిరిగే కథే అయినా, నిజాయితీ, ధైర్యం, మానవ సంబంధాలలోని సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ సినిమా సాగుతుంది. ‘చౌర్య పాఠం’ కేవలం ఒక సినిమాగా మిగిలిపోకుండా, ఓటీటీ వేదికపై ఓ లైవ్ డిస్కషన్ పాయింట్‌గా మారింది. నక్కిన నరేటివ్స్ బ్యానర్‌పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. హీరో ఇంద్రరామ్ నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇంద్ర రామ్ రెండవ సినిమా విభిన్న కథాంశంతో భారీ బడ్జెట్ పై రాబోతున్నట్టు తెలుస్తుంది..