CBFC Data Leak: చిత్ర పరిశ్రమలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సినిమాలకి సంబంధించి అత్యంత రహస్యంగా దాచి ఉంచే కథలు, డైలాగులు ఇప్పుడు నెట్టింట దర్శనమిస్తున్నాయి. దేశంలో సినిమాలను ధ్రువీకరించే కేంద్ర సెన్సార్ బోర్డు (CBFC) నుంచి ఒకేసారి ఏకంగా 500కు పైగా సినిమాలకు సంబంధించిన కీలక రికార్డులు బయటకు వచ్చేశాయి. రిలీజ్ కావాల్సిన చిత్రాల పూర్తి స్క్రిప్టులు సైతం ఇందులో ఉండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.
సాధారణంగా ఏ దర్శకుడైనా, నిర్మా తయినా తమ సినిమా కథ విడుదలయ్యే వరకు బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. అయితే థియేటర్లలో ప్రదర్శించాలంటే సెన్సార్ బోర్డు అనుమతి తప్పనిసరి కావడంతో, పూర్తి కథ, దృశ్యాల వివరాలతో కూడిన స్క్రిప్టులను బోర్డుకు అందించాల్సి వస్తుంది. పదేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘ఇ-సినీప్రమాణ్’ పోర్టల్ ద్వారా నిర్మాతలు ఈ పత్రాలను సమర్పిస్తున్నారు. సరిగ్గా ఇదే పోర్టల్‌లో భద్రతా లోపం తలెత్తి, నిర్మాతలు పంపిన స్క్రిప్టులు, బోర్డు సూచించిన కట్స్, అధికారిక పత్రాలన్నీ ఆన్‌లైన్ వేదికల్లోకి చేరిపోయాయి.
పాత, కొత్త వెబ్‌సైట్ల సమాచారాన్ని భద్రపరిచే ‘ఇంటర్నెట్ ఆర్కైవ్’ అనే డిజిటల్ లైబ్రరీలో ఈ ఫైళ్లన్నీ ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకునేలా కనిపించడంతో విషయం బయటపడింది. విషయం తెలియగానే ఆ సంస్థ వెంటనే ఆ ఫైళ్లను తొలగించి, సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందా లేక ఎవరైనా ఈ కథలను కాపీ చేసుకున్నారా అన్న అనుమానాలు సినీ వర్గాలను కలవరపెడుతున్నాయి. ఈ ఘటనపై సెన్సార్ బోర్డు స్పందిస్తూ.. పోర్టల్ భద్రతను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని వెల్లడించింది. ఇప్పటివరకు ఎవరి ఖాతాలూ హ్యాక్ అయినట్లు ఆనవాళ్లు లేవని, బయటపడ్డ ఫైళ్లను ఎవరూ డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఆధారాలు దొరకలేదని బోర్డు అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తి విచారణ ముగిసేవరకు అసలు ఎంత సమాచారం బయటకు వెళ్లిందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.

