Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!

Bunny Vas

Bunny Vas

నిన్నటి వరకు సినిమాల వసూళ్లపై ఇండస్ట్రీలో ఒక రకమైన చర్చ జరుగుతుండగా, బన్నీ వాస్ చేసిన విశ్లేషణ అందరినీ ఆలోచింపజేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ‘ప్రతి ఒక్కరికీ రూపాయి ఆదాయం పోయింది. పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది’ అంటూ బన్నీ వాస్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ప్రస్తావించారు. అంటే గతంతో పోలిస్తే నిర్మాణ వ్యయం పెరగడం, లాభాల శాతం తగ్గడం వంటి అంశాలను ఆయన ఎత్తి చూపారు.

ప్రస్తుతం సినిమాలు రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్లు వసూలు చేస్తున్నాయని వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ‘ఈ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కావు. టికెట్ రేట్లు పెరగడం, ఇతర ధరల పెరుగుదల వల్లే ఆ భారీ నంబర్లు కనిపిస్తున్నాయి’ అని స్పష్టం చేశారు. అంటే సినిమాకు వచ్చే జనం కంటే, వచ్చిన వారి నుంచి వసూలు చేసే ధరలే ఈ రికార్డులకు కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే కేవలం రేట్లు పెంచడం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా మార్పులు రావాలని ఆయన ఈ ట్వీట్ ద్వారా సూచించారు. అంతే కాదు..

‘సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతుంది.. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం.. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు..ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు. మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది?’ అంటూ సూటిగా మాట్లాడారు. ప్రజంట్ ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.