Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు

Brad Pitt

Brad Pitt

హాలీవుడ్‌లో ఒకప్పుడు వెలిగిన ఐకానిక్ జోడి ‘బ్రాంజెలీనా’ (బ్రాడ్ పిట్ – ఆంజెలీనా జోలీ). హాలీవుడ్‌లో ఆదర్శ జంటగా ప్రచారంలో ఉన్న ‘బ్రాంజెలీనా’ జంట కొన్నేళ్ల తర్వాత వివాహ బంధంలో మనస్పర్థలు రావడంతో విడిపోయారు.  2005లో ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ లవ్ కపుల్ సుదీర్ఘకాలం సహజీవనం తర్వాత 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి మొత్తం ఆరుగురు పిల్లలు (మడాక్స్, జహారా, షిలో, పాక్స్, నాక్స్, వివియెన్). వీరిలో ముగ్గురు దత్తత తీసుకున్న పిల్లలు కాగా, ముగ్గురు బ్రాడ్ పిట్ – ఆంజెలీనా జోలీకి కలిగిన పిల్లలు.

2016లో మనస్పర్థలు రావడంతో ఏంజెలీనా జోలీ బ్రాడ్ పిట్‌కు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కుటుంబ వివాదాలు, పిల్లల కస్టడీ మరియు చ్యాటో మిరావల్ వైన్‌యార్డ్ వ్యాపారానికి సంబంధించి వీరి మధ్య అనేక కోర్టు కేసులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ హాలీవుడ్ మీడియాతో బ్రాడ్ పిట్ మాట్లాడుతూ ‘ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే తన జీవితంలో అతిపెద్ద పొరపాటని, అసలు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోవాల్సింది. సుదీర్ఘ విడాకుల పోరాటం వల్ల తాను సంపాదించిన ఆస్తిలో దాదాపు సగం భాగం  తుడిచిపెట్టుకుపోయింది. ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా ఇది కోలుకోలేని దెబ్బతీసింది. తన పిల్లలను తనపైకి రెచ్చగొట్టడం వల్ల చివరకు వాళ్ళు తన ఇంటిపేరును (పిట్) కూడా తొలగించుకున్నారు’ అని బ్రాడ్ పిట్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం హాలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.